రూ.2వేల నోట్ల పేరిట చీటింగ్‌!

22 Sep, 2020 10:51 IST|Sakshi

పోలీసుల అదుపులో ఐదుగురు ముఠా సభ్యులు  

కాకినాడ రూరల్‌: తమ వద్ద రూ.2వేల నోట్లు ఉన్నాయని, రూ.500 నోట్లు ఇస్తే రూ.90 లక్షలకు రూ.కోటి ఇస్తామని నమ్మబలికి ఛీటింగ్‌కు ప్రయత్నించిన ముఠాను బాధితుడి ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. సర్పవరం సీఐ గోవిందరాజు ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. కాకినాడ రూరల్‌ వలసపాకల గ్రామంలోని గంగరాజునగర్‌ రోడ్డు నంబరు 7కు చెందిన చలగళ్ళ నాగప్రసాద్‌ను ఫోన్‌లో విశాఖపట్నానికి చెందిన నలుగురు, కాకినాడ కర్ణంగారి వీధికి చెందిన ఒకరు కలిపి చీటింగ్‌ చేసేందుకు ప్రయత్నించారు. తొలుత ఒక వీడియోలో రూ.2వేల నోట్లతో కూడిన అట్టపెట్టెలు భారీగా ఉన్నట్టు చూపించి, ఆ తరువాత ఫోన్‌ ద్వారా రూ.2వేల నోట్లు ఎక్కువగా ఉన్నాయని, రూ.500 నోట్లు తమకు కావాలని నమ్మబలికారు.

ఇందుకుగాను రూ.90 లక్షల రూ.5 వందల నోట్లకు రూ.కోటి (2వేల నోట్లు) అందిస్తామని నమ్మించారు. సోమవారం సాయంత్రం నాగమల్లిజంక్షన్‌ వద్దకు రావాలని కోరడంతో అనుమానం వచ్చిన నాగప్రసాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన సమాచారం మేరకు మాటు వేసిన పోలీసులు విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీకి చెందిన భమిడిపాటి వెంకట సుధాకర్, విశాఖపట్నం పెద్దజాలరిపేటకు చెందిన తాటికాయల రాజా రవిశేఖర్, విశాఖపట్నం మల్కాపురానికి చెందిన కామాక నరసింగరావు, విశాఖపట్నానికి చెందిన కోడి కొండబాబు, కాకినాడ కర్ణంగారి జంక్షన్‌కు చెందిన నిడదవోలు సూర్య సుబ్రహ్మశర్మలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎస్సై ఎం.నాగేశ్వరరావు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు