అన్నదమ్ముల పక్కా స్కెచ్.. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌..

8 Aug, 2021 19:10 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ రక్షితామూర్తి

సాక్షి, సర(హైదరాబాద్‌): తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములతోపాటు చోరీ సొత్తు విక్రయించేందుకు సహకరించిన మరో వ్యక్తిని కీసర పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ. 8.90 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం కీసర పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి వెల్లడించారు.  

గత నెల 27న నాగారం నవత అవెన్యూలో నివసించే కె.రమణయ్య ఇంటికి తాళం వేసి వనస్థలిపురంలోని అత్తగారింటికి వెళ్లారు. వచ్చేసరికి గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బెడ్‌రూంలో ఉన్న బీరువా ఓపెన్‌ చేసి 600 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు నగదు ఎత్తుకెళ్లారు. రమణయ్య ఇంటిపక్కనే ఉంటే సయ్యద్‌మహ్మద్‌ ఇంటి తాళాలు పగలగొట్టి వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. వీటితోపాటు నాగారంలోని పలు ఇళ్లలో చోరీలు జరుగుతుండటంతో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాల మేరకు కీసర ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్‌ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

శనివారం కీసర పోలీసులు నాగారం మున్సిపల్‌ పరిధిలోని రాంపల్లి చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న జి.యోగేందర్‌(27), జి.నాగేందర్‌(21)తోపాటు ఎన్‌.స్నేహాత్‌రాజ్‌(30)ను అదుపులోకి విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. యోగేందర్, నాగేందర్‌లు సోదరులు. చెడు అలవాట్లకు బానిసలై దొంగలుగా మారారు. పెయింటర్స్‌గా పనిచేస్తూ వచ్చిన డబ్బు సరిపోక దొంగతనాలు చేస్తున్నారు. యోగేందర్‌ పలు కేసులో నిందితుడని.. ఇతడిపై పీడీ యాక్ట్‌ నమోదై ఉంది. క్రైం డీసీపీలు యాదగిరి, షేక్‌ సాలి, మల్కాజిగిరి జోన్‌ అదనపు డీసీపీ శివకుమార్, కుషాయిగూడ ఏసీపీ వెంకన్ననాయక్, మల్కాజిగిరి సీసీఎస్‌ బాలు చౌహాన్, కీసర ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు