పెరోల్‌పై వచ్చాడు.. టిఫిన్‌ షాపు పెట్టాడు 

1 Oct, 2020 10:27 IST|Sakshi
పట్టుబడిన దుర్యోధనరావును చూపిస్తున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్సై మధు 

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన జీవితఖైదీ

కాశీబుగ్గలో చాకచక్యంగా పట్టుకున్న క్రైం టీం

కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): మహిళ హత్యకేసులో జీవిత ఖైదీగా జైలు పాలయ్యాడు.. సోదరి వివాహం కోసం పెరోల్‌పై వచ్చి ఎస్కార్ట్‌ కళ్లుగప్పి పరారయ్యాడు. ఒడిశా రాష్ట్రంలో తలదాచుకుంటూ టిఫిన్‌షాపు సైతం పెట్టేశాడు. సుమారు ఏడేళ్లుగా పోలీసులు గాలిస్తున్నా ఎక్కడా పట్టుబడలేదు. ఎట్టకేలకు స్వగ్రామంలో భూతగాదా విషయమై కాశీబుగ్గ వచ్చి పోలీసులకు చిక్కాడు. కాశీబుగ్గ సీఐ జి.శ్రీనివాసరావు కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన సార దుర్యోధనరావు 2007లో పాతపట్నానికి చెందిన జి.పార్వతి అనే మహిళను హత్య చేశాడు.

కేసు రుజువు కావడంతో 2013 ఆగస్టు 3న జిల్లా కోర్టు జీవితఖైదు విధించడంతో విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. నాలుగు నెలల తరువాత దుర్యోధనరావు సోదరికి వివాహం నిర్ణయించడంతో హాజరయ్యేందుకు అనుమతి కోరగా రెండురోజుల పాటు పెరోల్‌ ఇచ్చారు. ఎస్కార్ట్‌ సహాయంతో కాశీబుగ్గ వచ్చి పరారయ్యాడు. బతుకు తెరువు కోసం ఒడిశాలోని కొంధమాల్‌ జిల్లా బల్లిగుడలో టిఫిన్‌ షాపు నిర్వహిస్తూ అక్కడే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఆయన సోదరుడికి చెందిన ఇళ్లస్థలాల గొడవ జరుగుతుండడంతో అతనికి మద్దతుగా దుర్యోధనరావు తరచూ పోలీసులు కళ్లుగప్పి కాశీబుగ్గ వచ్చివెళ్తుండేవాడు. బుధవారం కూడా అతను రావడంతో ఎంపీడీవో కార్యాలయం రోడ్డులో చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసినట్టు సీఐ చెప్పారు. అతన్ని గురువారం పలాస కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐ మధుసూదనరావు పాల్గొన్నారు. 

క్రైం టీంకు అభినందనలు  
పరారీలో ఉన్న జీవితఖైదీ దుర్యోధనరావును పట్టుకోవడంలో కీలకభూమిక పోషించిన క్రైం టీం సభ్యులు హెడ్‌కానిస్టేబుల్‌ బి.ఢిల్లీశ్వరరావు, కానిస్టేబుళ్లు బి.లోకనాథం, ఎం.ఢిల్లీశ్వరరావులను కాశీబుగ్గ డీఎస్పీ శివరామరెడ్డి, సీఐ జి.శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. 

మరిన్ని వార్తలు