Crime: పగలు రెక్కీ.. రాత్రికి చోరీ! తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా..

8 Jan, 2022 09:07 IST|Sakshi
నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, నగదు

నిందితుడితోపాటు మరో ముగ్గురి అరెస్ట్‌  

15 తులాల బంగారం, రూ.2.45 లక్షలు రికవరీ 

వివరాలు వెల్లడించిన క్రైం ఏడీసీపీ శ్రావణ్‌కుమార్‌ 

సాక్షి, విశాఖపట్నం: పగలు ఆటో నడుపుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి... రాత్రి వేళ ఆ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్‌ కమిషనర్‌ కాన్ఫరెన్స్‌ హాలులో క్రైం ఏడీసీపీ శ్రావణ్‌కుమార్‌ మీడియాకు శుక్రవారం వెల్లడించారు. రైల్వే న్యూ కాలనీ సమీప శివాలయం వీధికి చెందిన షేక్‌ సహీద్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. పగలు అంతా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆటో నడుపుతూ... ఆ సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రెక్కీ నిర్వహించేవాడు. అనంతరం రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధి వేపగుంట సమీప నాయడుతోట అప్పలనర్సయ్య కాలనీలో మున్సి లియాకత్‌ కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన గత ఏడాది డిసెంబర్‌ 27న కుమారుడి రిసెప్సన్‌ కోసం వేరే ప్రాంతానికి వెళ్లారు. ఆ ఇంటిని, వారి కదలికలను నిశితంగా గమనిస్తున్న షేక్‌ సహీద్‌ అదే రోజు రాత్రి ఆ ఇంటిలో చోరీకి పాల్పడ్డాడు. ఇంటి వెనక డోర్‌ తాళం పగలుగొట్టి 8 తులాల బంగారు ఆభరణాలు,  రూ.2.30 లక్షల నగదు అపహరించుకుపోయాడు. 


                       మీడియాతో మాట్లాడుతున్న క్రైం ఏడీసీపీ శ్రావణ్‌కుమార్‌

పట్టించిన సీసీ కెమెరాలు  
కుమారుడి రిసెప్సన్‌ కార్యక్రమం తర్వాత మరుసటి రోజు డిసెంబర్‌ 28న ఇంటికి వచ్చిన మున్సి లియాకత్‌ చోరీ జరిగిందని గుర్తించి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఏసీపీ పెంటారావు నేతృత్వంలో సీఐలు లూథర్‌బాబు, సింహాద్రినాయుడు, ఎస్‌ఐలు ఎం.రాధాకృష్ణ, డి.కాంతారావు, ఎం.గణపతిరావు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో చోరీ జరిగిన ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా షేక్‌ సహీద్‌ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించడంతోపాటు మరో ఐదు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగు, కంచరపాలెం పీఎస్‌ పరిధిలో ఒక చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. మొత్తం 17 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.3.80 లక్షల నగదు చోరీ చేయగా... 15 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.2.45 లక్షల నగదు, ఒక బైక్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దొంగలించిన బంగారం కొనుగోలు చేస్తూ సహకరించిన పుట్టా భరత్‌కుమార్, బిక్కలు కళావతి, లంకా కామేశ్వరిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సమావేశంలో ఏసీపీ పెంటారావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

చదవండి: Nellore: పాపం పసివాళ్లు! అమ్మానాన్నలు కాదనుకున్న అభాగ్యులు

మరిన్ని వార్తలు