ఓ ఇంట్లో చోరి చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన దొంగ.. తీరాచూస్తే..

29 Apr, 2021 14:13 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, చాంద్రాయణగుట్ట(హైదరాబాద్‌): అర్ధరాత్రి వేళ ఓ ఇంట్లో చోరీ చేస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఓ పాత నేరస్థుడిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్‌ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ఏకే జిలానీ తెలిపిన వివరాలు.. తార్నాకకు చెందిన కిశోర్‌ (34) ఓవైసీ ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతుండడంతో మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు ఛత్రినాక ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ ఖాదర్‌ జిలానీ ఉప్పుగూడ శివాజీనగర్‌లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఇదే సమయంలో బస్తీలోని ఓ ఇంట్లోకి ప్రవేశిస్తున్న కిశోర్‌ను పోలీసులు ప్రశ్నించడంతో తడబడుతూ కనిపించాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో దొంగతనం చేసేందుకు వచ్చినట్లు అంగీకరించాడు. ఇతడు గతంలో కూడా సెల్‌ఫోన్‌ దొంగతనంతో పాటు మరో చోరీ కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.    
 

మరిన్ని వార్తలు