‘ప్రేమ్‌’నగర్‌లో పోలీసుల దాడి

30 Jul, 2020 12:17 IST|Sakshi
తంగళ్లపల్లిలో కౌన్సెలింగ్‌ ఇస్తున్న సీఐ సర్వర్‌

వేశ్యవృత్తి మానుకోవాలని హితవు 

మైనర్ల సమాచారంపై నిఘా 

సిరిసిల్లక్రైం: బాలికలను వేరే ప్రాంతాల నుంచి తీసుకువచ్చి వేశ్యవృత్తిలోకి దింపుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు సిరిసిల్లలోని ప్రేమ్‌నగర్‌లో సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఆరేళ్ల క్రితం ఓ యువతికి విద్యాబుద్ధులు నేర్పిస్తామని నమ్మబలికి వ్యభిచార వృత్తిలోకి దింపడం.. ఈ విషయమై సదరు యువతి తన కుటుంబీకులకు సమాచారం ఇవ్వడం ఆదివారం రాత్రి జరిగింది. దీంతో ‘సాక్షి’లో ‘యువతికి విముక్తి’ శీర్షికన సోమవారం కథనం ప్రచురితమైంది. ఇదే సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసులు సిరిసిల్లలోని వేశ్యగృహాలపై దాడులు నిర్వహించారు. ఆ గృహాల్లో ఉన్నవారి నివాస ధ్రువీకరణ పత్రాలు విధిగా ఇవ్వాలని పోలీస్‌ అధికారి ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మైనర్లతో ఇలాంటి పనులు చేయిస్తే చట్టపరిధిలో చర్యలకు వెళ్తామని, బతుకుదెరువు కోసం ఇతర వృత్తుల్లో నైపుణ్యం పెంచుకోవాలని, సమాజంలో మంచి వ్యక్తులుగా తయారవ్వాలని, సదరు కాలనీవాసులపై నిఘా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. 

సమాజంలో గౌరవంగా బతకాలి : రూరల్‌ సీఐ సర్వర్‌
తంగళ్లపల్లి(సిరిసిల్ల): పడుపు వృత్తిని నిర్వహిస్తూ అందరిచే చీత్కారాలకు గురై సమాజంలో చీడపురుగుల మారకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని అందరూ మెచ్చుకునే విధంగా గౌరవంగా బతకాలని రూరల్‌ సీఐ సర్వర్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రలోని మానేరువాగు సమీపంలో గల వేశ్యగృహాలపై రూరల్‌ సీఐ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మహిళలు, యువతులు, చిన్నారులు ఎవరైనా ఉన్నారా అని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ప్రతీ ఇంట్లో ఎంత మంది ఉంటున్నారో అడిగి, వారి ఆధార్‌కార్డులు, బర్త్‌ సర్టిఫికెట్లు పరిశీలించారు. పడుపు వృత్తిని వీడనాడాలని కొత్త జీవితాలను ప్రారంభించాలని వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి మహిళలు, యువతులు, చిన్నారులను తీసుకురావాడం, పడుపు వృత్తిని నిర్వహించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని గౌరవంగా బతకాలని సూచించారు. పోలీస్‌ ఆకస్మిక తనిఖీలు ఇకపై ఎప్పుడూ కొనసాగుతాయని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో తంగళ్లపల్లి ఎస్సై అభిలాష్, హెడ్‌ కానిస్టేబుల్‌ బుచ్చినాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. 

చైల్డ్‌వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో తనిఖీ..
ఇతర ప్రాంతాల నుంచి యువతులు, చిన్నారులను తీసుకవచ్చి బలవంతంగా వారిచే పడుపు వృత్తి నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు బుధవారం సాయంత్రం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు తంగళ్లపల్లి వేశ్యావాటికలను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. వారి నుంచి సమాచారం సేకరించారు. 

మరిన్ని వార్తలు