కడుపులో బంగారం మాయం.. భార్య ఫిర్యాదుతో అసలు కథ వెలుగులోకి!

25 Jul, 2022 13:38 IST|Sakshi

సాక్షి,చెన్నై: కస్టమ్స్‌ వర్గాల కళ్లుగప్పేందుకు కడుపులో దాచి పెట్టుకొచ్చిన బంగారం బిస్కెట్లలో ఒకటి మాయం అయ్యింది. సినీ ఫక్కీలో సాగిన ఈ అక్రమ రవాణాలో ఓ యువకుడిని స్మగ్లర్లు కిడ్నాప్‌ చేశారు. ఆ బిస్కెట్‌ కోసం చిత్ర హింసలు పెట్టారు. చివరికి ముంబై పోలీసులు రంగంలోకి దిగి, ఆయువకుడిని రక్షించారు. ఆదివారం తిరువారూర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు.. తిరువారూర్‌కు చెందిన హిజాబ్‌ చెన్నైలో సెల్‌ ఫోన్‌ దుకాణం నడుపుతున్నాడు. మిత్రుడు ఔరంగ జేబ్‌ ద్వారా ముంబై నుంచి చెన్నైకు బంగారం అక్రమంగా తెప్పించుకుంటూ వచ్చాడు.

చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్,నిఘా వర్గాల కళ్లు గప్పేందుకు సినీ ఫక్కీలో ఔరంగ జేబు మనుషులు చిన్న చిన్న బంగారం బిస్కెట్లను మింగేసే వారు. చెన్నైకు వచ్చినానంతరం కడుపు శుభ్రం చేయించే మాత్రల ద్వారా వాటిని బయటకు తీసేవారు. ఈ  పరిస్థితుల్లో ముంబైకు చెందిన శంకర్‌ ద్వారా 2 రోజుల క్రితం చెన్నైకు ఇదే తరహాలో బంగారం తీసుకొచ్చారు. అయితే, తీసుకొచ్చిన బంగారంలో ఓ బిస్కెట్‌ మాయం కావడంతో శంకర్‌ను ఔరంగ జేబు, హిజాబ్, వారి అనుచరుడు విజయ్‌ కలిసి కిడ్నాప్‌ చేశారు. తిరువారూర్‌కు తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టారు. కారైక్కాల్‌లోని ఓ స్కాన్‌ సెంటర్‌కు తీసుకెళ్లి  పరిశోధించారు. అయితే, ఆ బంగారం బిస్కెట్‌ ఏమైందని శంకర్‌ను తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో  ఆదివారం ఉదయాన్నే ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. 

భార్య ఫిర్యాదుతో.. 
ముంబైలో ఉన్న శంకర్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో బంగారం అక్రమ రవాణా గుట్టు వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ వ్యహారాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న ముంబై పోలీసులు స్మగ్లర్ల కోసం చెన్నైకు వచ్చారు. ఇక్కడి పోలీసు సాయంతో శంకర్‌ సెల్‌ ఫోన్‌ నంబర్‌ ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. తిరువారూర్‌లో శంకర్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో కిడ్నాపర్ల చెర నుంచి అతడిని రక్షించి, ఆస్పత్రికి తరలించారు. ఔరంగ జేబు, విజయ్‌ను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నా రు. పరారీలో ఉన్న హిజాబ్‌ కోసం గాలిస్తున్నారు.

చదవండి: ఊర్లో ఆడవాళ్లు, మగవాళ్లు నామీద ఇంత పగతో ఉన్నారా?

మరిన్ని వార్తలు