కోడలే సూత్రధారి..! ఆస్తికోసం ప్రియుడితో కలిసి

15 Aug, 2021 16:06 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట (నల్లగొండ): సూర్యాపేట మండలం కుసుమవారిగూడెంలో వెలుగుచూసిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం కోడలే ప్రియుడితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. స్థానిక రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం  సీఐ బి.విఠల్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.  కుసుమవారిగూడెం గ్రామానికి చెందిన కుసుమ లలిత అలియాస్‌ లలితమ్మకు ఇద్దరు కుమార్తెలు వెన్న చంద్రకళ, ముప్పని సూర్యకళ, కుమారుడు మధుసూదన్‌రెడ్డి సంతానం.

వివాహ సమయంలో ఒక్కో కుమార్తెకు కట్నం కింద రెండెకరాల భూమి ఇచ్చారు. మిగిలిన 3.24 గుంటల వ్యవసాయ భూమి లలితమ్మ భర్త వీరారెడ్డి పేరుపై ఉంది. రెండేళ్ల క్రితం లలితమ్మ భర్త వీరారెడ్డి అనారోగ్యంతో  మృతిచెందాడు.   వీరారెడ్డి పేరిట ఉన్న భూమిని కుమారుడు మధుసూదన్‌రెడ్డి సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

3.24గుంటల భూమి కోసం 
మధుసూదన్‌రెడ్డి తన భార్యతో కలిసి సూర్యాపేట పట్టణంలో కిరాణ షాపు నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా మధుసూదన్‌రెడ్డికి మూర్చ రోగం ఉండడంతో అప్పుడప్పుడు కిందపడిపోతుంటాడు. విజయలక్ష్మి కొన్నేళ్లుగా వ్యవసాయ భూమి విషయంలో అత్తతో తరచుగా ఘర్షణ పడేది. అత్త వద్ద ఉన్న నగదుతో పాటు భూమిలో పండుతున్న పంటను బిడ్డలకు పెడుతుందని అత్తపై కోపం పెంచుకుంది.

గ్రామంలో ఉన్న 3.24 గుంటల వ్యవసాయ భూమిని తనభర్త పేరుపై మార్చాలని గ్రామానికి వచ్చినప్పుడుల్లా కోడలు విజయలక్ష్మి అత్త లలితమ్మతో గొడవ పడుతుండేది. దీంతో అత్తను చంపి  భూమిని కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు తమకు మూడుసంవత్సరాలుగా కూలి పనులకు వచ్చే పెన్‌పహాడ్‌ మండలం అనాజిపురం గ్రామానికి చెందిన నూకల సైదులు సహాయంతో విజయలక్ష్మి తన అత్త లలితమ్మను హత్య చేయించింది. 

తనకేమీ తెలియదన్నట్లుగా.. ఆస్తి కోసం కోడలే ప్రియుడితో
గ్రామంలోని ఒంటరిగా ఉండే కుసుమ లలితమ్మ ఈనెల 9వ తేదీన ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉంది. తోడి కోడలు గమనించి కుమారుడు మధుసూదన్‌రెడ్డి, కోడల విజయలక్ష్మిలకు సమాచారం చేరవేసింది.  కోడలు విజయలక్ష్మి అత్త హత్య విషయం తనకేమి తెలియనట్లుగా నటిస్తూ వచ్చింది. ఈనెల 10న ఇంట్లో పనిచేసే నూకల సైదులుపై అనుమానం వచ్చిన పోలీసులు అనాజిపురం గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. సైదులును లోతుగా విచారించగా.. కుసుమ లలితమ్మ కోడలు విజయలక్ష్మి తమ అత్తను హత్య చేయాలని చెప్పడంతోనే తాను కత్తితో దాడిచేసి చంపినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.

వెంటనే సూర్యాపేట పట్టణంలో నివాసముంటున్న కోడలు విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు.  సైదులు వద్ద ఉన్న ముంజకత్తి, రెండు తులాల బంగారు గొలుసు, ఇత్తడి గాజులు, సెల్‌ఫోన్, ఎక్సెల్‌ వాహనం స్వాధీనం చేసుకున్నారు. కే సును ఛేదించిన రూరల్‌ పోలీసులను సీఐ విఠల్‌రెడ్డి అభినందించారు. సమావేశంలో ఎస్‌ఐ లవకుమార్, ఐడీ పార్టీ సిబ్బంది కల్యాణి, లింగనాయక్, డి.మరేష్, బాబు, రాంబాబు, గుర్వయ్య పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు