పెళ్లికి వెళ్లిన బాలికకు మాయమాటలు చెప్పి..

7 May, 2022 06:48 IST|Sakshi

మైసూరు(బెంగళూరు): పెళ్లికి వచ్చిన వ్యక్తి కళ్యాణ మండపంలోని బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఈ ఘటన మైసూరులో జరిగింది. మండ్య జిల్లాలోని బేళూరుకి చెందిన ప్రతాప్‌ అనే వ్యక్తి మైసూరు గోకులం లేఔట్‌లో కళ్యాణ మండపానికి బంధువుల పెళ్ళికి వచ్చాడు. అదే పెళ్లికి వచ్చిన ఒక బాలికపై కన్నేశాడు. ఆమెకు మాటలు చెప్పి కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి మండ్య సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో రిజిస్టర్‌ పెళ్లి చేసుకొన్నాడు. ఇంతలో బాలిక తల్లిదండ్రులు వివి పురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు గాలించి ఇద్దరినీ తీసుకొచ్చారు. బాలికను మైసూరులోని బాల మందిరానికి తరలించారు. నిందితున్ని అరెస్టు చేశారు. కాగా, మైనర్‌తో పెళ్లిని రిజిస్ట్రార్‌ ఆఫీసు అధికారులు ఎలా అనుమతించారన్నది తేలాల్సి ఉంది.

మరో ఘటనలో..

ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
బనశంకరి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందిన ఘటన కెంగేరి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బెంగళూరు నగరంలోని రామయ్య ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థి సుముఖ్‌ (22), పీఈఎస్‌ కళాశాల విద్యార్థిని లీనా నాయుడు (19) గురువారం సాయంత్రం కారులో  నైస్‌రోడ్డు వైపు వేగంగా వెళ్తుండగా కారు అదుపుతప్పి మినీ బస్సును ఢీకొట్టి బోల్తాపడింది. వెనుకనే వస్తున్న మరో కూడా బోల్తా పడింది. కారులో ఉన్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, బస్సు డ్రైవర్‌కు రెండు కాళ్లు విరిగిపోయాయి. మరో కారులో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  

చదవండి: బిర్యానీతో కలిపి నగలు మింగేశాడు

మరిన్ని వార్తలు