స్నేహితుడి భార్యపై కన్నేశాడు.. గోవా ట్రిప్‌ ప్లాన్‌ చేసి..

5 Mar, 2022 18:47 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ జే రాంబాబు 

సాక్షి, గుంటూరు: రెండు సంవత్సరాల కిందట తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఇద్దరు యువకుల మిస్సింగ్‌ కేసును ఛేదించినట్లు నార్త్‌ జోన్‌ డీఎస్పీ జే రాంబాబు తెలిపారు. రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తాడికొండ మండలం లాం గ్రామానికి చెందిన శాఖమూరి అజయ్‌సాయి, గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన చల్లపల్లి ఫణికృష్ణ(25)లు స్నేహితులు. వారిద్దరూ స్నేహితులతో కలిసి మద్యం సేవించేవారు.

ఈ నేపథ్యంలో హతుడు చల్లిపల్లి ఫణికృష్ణ, నిందితుడు అజయ్‌సాయి భార్యపై కన్నేశాడు. ఈ విషయాన్ని సాయికి చెప్పడంతో పాటు ఆమె డెలివరీకి వెళ్లిన సమయంలో ఎప్పుడూ వస్తుందంటూ వేధించేవాడు. ఈ నేపథ్యంలో ఫణికృష్ణను అంతమొందించేందుకు సాయి ప్రణాళిక రూపొందించాడు. ఇద్దరూ కలిసి గోవా ట్రిప్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. 2020 ఫిబ్రవరి 16వ తేదీన రాత్రి 11 గంటలకు కారులో ఇద్దరూ బయలేదేరారు. మంజునాథ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వేసిన స్థలాలలో పిచ్చి మొక్కలు పెరిగి ఉండడంతో ఖాళీ స్థలంలో కూర్చుని ఇద్దరూ మద్యం సేవిస్తున్నారు.

చదవండి: (కోడి కూరతో అన్నం పెట్టమన్నాడు.. ఆ మాటకు గొడ్డలితో నరికేశాడు)

అజయ్‌సాయి భార్య గురించి అసభ్యంగా మాట్లడడంతో ఆగ్రహం చెందిన అతను పక్కనే ఉన్న రాయితో కృష్ణ తలపైన కొట్టి చంపాడు. ముందుగా అనుకున్న ప్రకారం కారులో తెచ్చుకున్న పెట్రోల్‌తో హతుడిని తగులపెట్టి సమీపంలో తన పర్సు, ఓటర్‌ ఐడీ, ఆధార్‌కార్డు వదిలి కారులో తన బట్టల బ్యాగ్‌ను వుంచి హతుడికి చెందిన బట్టల బ్యాగ్, సెల్‌ఫోన్, పెన్‌డ్రైవ్, ఎస్‌డీ కార్డు తీసుకుని పారిపోయాడు.

చదవండి: (వివాహేతర సంబంధం.. ఒకే గదిలో ముగ్గురు.. చివరకు..)

అదే నెలలో 19వ తేదీన సాయి తల్లి  శైలజ తన కుమారుడితోపాటు అతని స్నేహితుడు ఫణికృష్ణ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. తాడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి నుంచి అజయ్‌సాయి అదృశ్యమయ్యాడు. చివరకు ఈనెల 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. హత్య చేసిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. దీంతో నిందితుడిని కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. సమావేశంలో రూరల్‌ సీఐ వి భూషణం, తాడికొండ ఎస్‌ఐ వెంకటాద్రి, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు