టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్లకు నిరసన సెగ 

25 May, 2022 05:16 IST|Sakshi
ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను అడ్డుకుని నిరసన తెలియజేస్తున్న మహిళలు, స్థానికులు

అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలను నాశనం చేశారని మహిళల ఆగ్రహం 

ధూళిపాళ్ల మరికొంత మందిపై పోలీసులకు ఫిర్యాదు 

శేకూరు(చేబ్రోలు): ‘టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ గ్రామంలోని మట్టి అంతా రైల్వేకు, జిల్లా నలుమూలలకు అమ్ముకుని కోట్లు  సంపాదించుకున్నారు.. నేడు జగనన్న కాలనీలకు పంచాయతీ తీర్మానం ద్వారా మట్టి తోలుకుని మెరక చేసుకుంటుంటే నీకు ఎందుకు అంత కడుపుమంట’ అని శేకూరు గ్రామ మహిళలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను నిలదీశారు.

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శేకూరు గ్రామంలోని ఊరచెరువు పూడికతీతకు కొద్ది రోజుల క్రితం పంచాయతీ తీర్మానం చేశారు. చెరువులోని పూడికతీత ద్వారా వస్తున్న మట్టితో గ్రామంలోని జగనన్న కాలనీలు, రోడ్లు, డొంకలను అభివృద్ధి చేస్తున్నారు. చెరువులోని మట్టి వైఎస్సార్‌సీపీ నాయకులు అమ్ముకుంటున్నారని టీడీపీ నాయకులు ప్రచారం చేసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను గ్రామంలోకి తీసుకొచ్చారు.  

ధూళిపాళ్లను అడ్డుకున్న మహిళలు, స్థానికులు 
‘టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితవాడలను అభివృద్ధి చేయని నీవు ఇప్పుడు  చెరువు పూడికతీతను అడ్డుకోవడానికి వచ్చావా’ అని ధూళిపాళ్లపై శేకూరు మహిళలు, దళితవాడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో గ్రామంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువులను క్వారీలుగా మార్చిన ఘనత మీదేనని విమర్శించారు.  నరేంద్రకు వ్యతిరేకంగా  పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కంగుతిన్న ధూళిపాళ్ల వెనుదిరిగి పంచాయతీ ఆఫీసు వద్దకు వెళ్లారు.  

దళిత మహిళకు గాయాలు, పోలీసులకు ఫిర్యాదు 
శేకూరులో చెరువును పరిశీలించడానికి వచ్చిన టీడీపీ నేతలు మహిళపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మాతంగి హేమరాజ్యం, మంచాల జాన్సన్‌కు గాయాలవడంతో 108 వాహనం ద్వారా తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ధూళిపాళ్ల నరేంద్ర పంచాయతీ కార్యాలయంలో దళిత మహిళాసర్పంచ్‌పై అసభ్యకరంగా మాట్లాడటంపై ఆమె నిరసన తెలిపారు.

టీడీపీ శ్రేణులు జరిపిన దాడి ఘటనకు బాధ్యులైన ధూళిపాళ్ల నరేంద్రకుమార్, శివలింగప్రసాద్, ఎం.అశోక్, సత్యనారాయణ, సుబ్బారావు మరికొంతమందిపై  కులంపేరుతో దూషించినట్లు, హత్యాయత్నం తదితర అంశాలపై కేసు నమోదు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్‌ మాతంగి శ్యామల, భర్త శ్యామారావు, స్థానిక నాయకులు ఎస్‌ఐ వై.సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు.   

మరిన్ని వార్తలు