దివ్యాంగురాలిది ఆత్మహత్యే

22 Dec, 2020 11:00 IST|Sakshi

ఓఎస్‌డీ చౌడేశ్వరి నేతృత్వంలో  ప్రత్యేక దర్యాప్తు 

వివరాలు వెల్లడించిన ఎస్పీ సిద్ధార్ధ కౌశల్

ఒంగోలు: నగర పరిధిలోని దశరాజుపల్లి రహదారిలో ఈ నెల 18న సజీవ దహనమైన దివ్యాంగురాలిది ఆత్మహత్యేనని జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ తెలిపారు. స్థానిక పోలీస్‌ కల్యాణ మండపంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. దశరాజుపల్లి రోడ్డులో దివ్యాంగులు తన వాహనంలోనే కాలిపోతుండటాన్ని గమనించిన స్థానికులు డయల్‌ 100 కు సమాచారం ఇచ్చారు. తాలుకా సీఐ శివరామకృష్ణారెడ్డి సిబ్బంది, ఫైర్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు.  అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. ఘటనాస్థలంలో లభ్యమైన బ్యాగులో లభించిన ఆధారాల ప్రకారం మృతురాలు ఉమ్మనేని భువనేశ్వరిగా గుర్తించారు. మృతురాలు స్థానిక గోపాల్‌నగరం ఏడో డివిజన్‌లో వార్డు వలంటీర్‌గా పనిచేస్తుంది.

మృతురాలి తల్లి జానకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు సాగించారు.ఓఎస్‌డీ కె.చౌడేశ్వరి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. నాలుగు టీంలుగా విడిపోయి విచారణ సాగించారు. నేరస్థలంలో లభ్యమైన సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్ష్యులను గుర్తించి వారిని విచారించారు. మృతురాలు రెండు సెల్‌ఫోన్లు వాడుతున్నట్లుగా గుర్తించి వాటి కాల్స్‌ విశ్లేషించారు.  మృతురాలు ప్రయాణించిన మార్గంలో సీసీ టీవీ ఫుటేజీ విశ్లేషణ ఆధారంగా దర్యాప్తు కొనసాగించి మృతురాలు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారణకు వచ్చినట్లు ఎస్పీ వివరించారు.  (దారుణం: ట్రై సైకిల్ పైనే భువనేశ్వరి సజీవ దహనం )

 ► దివ్యాంగురాలు దశరాజుపల్లి రోడ్డులో తన త్రిచక్రవాహనంలో వెళుతుండడాన్ని దశరాజుపల్లికి చెందిన కిమ్స్‌ హాస్పిటల్‌ సెక్యూరిటీ గార్డు గోగిల శ్రీకాంత్‌ గమనించాడు. మరో సెక్యూరిటీ గార్డు పెనం కొండయ్య యువతి  దగ్ధమవుతున్న విషయాన్ని గుర్తించాడు. వీరిద్దరు కిమ్స్‌ హాస్పిటల్‌ సెక్యూరిటీ ఇన్‌ఛార్జి నీరంపల్లి చండేశ్వర్‌కు తెలియపరచగా వారు డయల్‌ 100కు ఫిర్యాదు చేశారు. మృతురాలు కమ్మపాలెం నుంచి జాతీయ రహదారివైపు ఒంటరిగా వెళుతుండగా పోతురాజు కాలువ బ్రిడ్జి ఎక్కలేకపోతుండడంతో అక్కడ సబ్‌స్టేషన్‌ సిబ్బంది బాలాజీ, తిరుమలరావులు   బ్రిడ్జిపైకి వెళ్లేందుకు సాయం చేశారు. జాతీయ రహదారి కింద గోపాలనగరం 4వ లైనుకు చెందిన గొర్రెల కాపరి గొల్లప్రోలు శ్రీహరి ఆమె ఒంటరిగా వెళుతుండడాన్ని గుర్తించాడు.  

 ► మృతురాలు సామాజిక మాధ్యమంలో గ్రూప్‌ ద్వారా గుంటూరుకు చెందిన మనోజ్, విశాఖకు చెందిన తనూజ, శ్రీకాకుళంకు చెందిన కృష్ణలతో ప్రతిరోజు గ్రూప్‌ చాటింగ్‌ చేస్తుంటుంది. ఈ నెల 18న సాయంత్రం 7.03 గంటల నుంచి మృతురాలు చాటింగ్‌లో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది.  ఈ మేరకు సాక్ష్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు.  సాయంత్రం 6.45గంటల సమయంలో తన స్నేహితుడైన బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మనోజ్‌కు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నేరస్థలం నుంచి వాట్సప్‌లో ఆడియో రికార్డు చేసి పంపించింది.  అ పోస్టుమార్టం నివేదిక పరిశీలిస్తే మృతురాలి శరీరంపై ఎటువంటి గాయాలు లేవు. మృతురాలు తన స్నేహితులైన ఆటో డ్రైవర్లు రాము, నాయబ్‌రసూల్‌ల ద్వారా 18వ తేదీ సాయంత్రం 6.15 గంటల సమయంలో పెట్రోలు క్యానును తెప్పించుకుని తన త్రిచక్ర వాహనంలో పెట్టుకుండటాన్ని  మార్గమధ్యంలో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు.

 ► ఘటనకు ముందు భువనేశ్వరి తన వాట్సప్‌ స్టేటస్‌లో ఇక తన వాట్సప్‌ పనిచేయదని, కొంత మంది స్నేహితులు, బంధువులకు బాయ్‌..బాయ్‌ చెప్పడం వంటివి గుర్తించామని ఎస్పీ తెలిపారు. కేసులో కేవలం 48గంటల్లోనే నిజాలు నిగ్గుతేల్చారంటూ ప్రత్యేక దర్యాప్తు అధికారి కె.చౌడేశ్వరి, ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్, తాలూకా సీఐ ఎ.శివరామకృష్ణారెడ్డి, ఎస్సైలు సోమశేఖర్, పునావవు, నాయబ్‌రసూల్, ఏఎస్సై దయానంద్, రమేష్, హెడ్‌కానిస్టేబుళ్లు రామకృష్ణ, జి.బాబు, ఎస్‌బీ హెచ్‌సీ నరశింహారావు, కానిస్టేబుల్‌ రవిలను ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ప్రత్యేకంగా అభినందించారు. 

మరిన్ని వార్తలు