బెంగళూరులో దంపతుల హత్య... అనంతపురంలో నిందితుల అరెస్టు

25 Aug, 2021 08:35 IST|Sakshi

బనశంకరి: వరలక్ష్మీ వ్రతం రోజున బెంగళూరు కుమారస్వామి లేఅవుట్‌లో దంపతుల హత్య కేసులో నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ప్రధాన సూత్రధారి అనంతపురం జిల్లాకు చెందిన నారాయణస్వామి, తిరుమలదేవరపల్లి గంగాధర, దేవాంగం రాము, షేక్‌ ఆసిఫ్‌ అరెస్టయిన వారిలో ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. కాంతరాజు, ప్రేమలత దంపతుల ఇంట్లో నారాయణస్వామి అద్దెకు ఉన్నాడు. యజమాని ఇంట్లో డబ్బు, బంగారం దోపిడీకి పథకం వేశాడు. వరలక్ష్మీ వ్రతం రోజున మధ్యాహ్నం తన ముగ్గురు అనుచరులతో కలిసి వచ్చాడు. ప్రేమలత తలుపు తీసి ఇంట్లోకి పిలిచి తాగడానికి నీరు, టీ ఇచ్చింది.

చదవండి: 2 సెంట్ల భూమి కోసం.. 20 ఏళ్లుగా పోరాటం..!

దంపతులతో మాట్లాడిన కాసేపటి తరువాత దేవాంగం రాము బాత్‌రూమ్‌ ఎక్కడ ఉందని ప్రేమలతను అడిగాడు. అనంతరం ఆమెను బాత్‌రూమ్‌లోకి తోసి బైక్‌ క్లచ్‌ వైర్‌తో గొంతుకు బిగించి చంపాడు. ఇతడికి మరొకరు సహకరించారు. ఇంతలో హాల్లో నారాయణస్వామి మరో వ్యక్తితో కలిసి కాంతరాజును తలదిండుతో అదిమి, చాకుతో గొంతుకోసి హత్యచేశారు. అనంతరం బీరువాను తెరిచి అందులో ఉన్న 193 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 వేల నగదు తీసుకుని పారిపోయారు. మెజిస్టిక్‌ బస్టాండు నుంచి అనంతపురానికి ఉడాయించారు. వందలాది సీసీ కెమెరా చిత్రాలు, ప్రత్యక్ష సాక్షులను విచారించి నిందితుల  ఆచూకీ కనిపెట్టిన పోలీసులు వారిని అనంతపురం జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేశారు. వీరు బెంగళూరులో మరో రెండు హత్యలు చేసినట్లు వెల్లడైందని, వాటిపైనా దర్యాప్తు చేస్తున్నామని దక్షిణ విభాగ డీసీపీ హరీశ్‌పాండే, సుబ్రమణ్యపుర ఏసీపీ శివకుమార్‌ తెలిపారు.

చదవండి: భూమి లాక్కున్నారని రైతు ఆత్మహత్య 

మరిన్ని వార్తలు