మూడు హత్యల మిస్టరీ: 24 గంటల్లోనే చేధించారు

7 Oct, 2020 09:05 IST|Sakshi
మాట్లాడుతున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, వెనుక వరుసలో నిందితులు(ముసుగు ధరించిన వారు)

సాక్షి, విస్సన్నపేట(తిరువూరు): ముగ్గురు వ్యక్తులను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన కేసు మిస్టరీని పోలీసులు 24 గంటలలోనే ఛేదించారు. నిందితులను అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్‌ వద్ద మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వివరాలు వెల్లడించారు. ఆగిరిపల్లి మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన పెల్లూరి చినస్వామి(35) చింతలపూడికి చెందిన దాసరి వెంకన్న వద్ద పనిచేస్తూ అతనికి చెందిన ఆటోలో ప్లాస్టిక్‌ సామగ్రి విక్రయించేవాడు. ఆయన తన భార్య తిరుపతమ్మ(30), కుమార్తె(11)లతో కలసి నూజివీడు రామాయమ్మపేటలో నివాసం ఉంటున్నాడు. వెంకన్న భార్యతో స్వామికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అతని హత్యకు వెంకన్న పథకం రచించాడు.

దీనిలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి చినస్వామితో మద్యం తాగిస్తూ రాత్రి 10.30 గంటల సమయంలో నూజివీడు వెళ్లివద్దామని తన ఆటోతోపాటు మరో ఆటోలో స్వామి, అతని భార్య తిరుపతమ్మ, కుమార్తెలను తీసుకుని రెడ్డిగూడెం మండలం ముచ్చెనపల్లి సమీపంలో మామిడితోటలోకి వెళ్లారు. అక్కడ ఇనుపరాడ్, కర్రతో కొట్టి భార్యాభర్తలను చంపారు. అనంతరం చున్నీ బాలిక మెడకు బిగించి హత్య చేశారు. రోడ్డుప్రమాదంగా చిత్రీకరించేందుకుగాను మృతదేహాలను ఆటోలో వేసుకుని విస్సన్నపేట ఎ.కొండూరు రోడ్డులోని ఎన్‌ఎస్పీ కాలువ వద్దకు వెళ్లారు. అక్కడ ఆటోతోపాటు మృతదేహాలను కాలువలో పడవేసే ప్రయత్నం చేశారు. చప్టా అడ్డు రావటంతో ఆటో కాలువలోకి వెళ్లకుండా ఇరుక్కపోయింది. అటుగా వాహనాలు రావటంతో అక్కడి నుంచి పరారయ్యారు.  (దారుణం: కుటుంబం మొత్తాన్ని చంపేశారా?)

మృతదేహాలను చూసి మృతుడి తండ్రి యల్లయ్య ఇది హత్యేనని తన కుమారుడు పనిచేస్తున్న యజమాని పనే అని చింతలపూడికి చెందిన దాసరి వెంకన్నపై అనుమానం వ్యక్తం చేయటంతో దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు నందిగామ, నూజివీడు డీఎస్పీలు రమణమూర్తి, శ్రీనివాసులు నేతృత్వంలో సీఐలు శేఖర్‌బాబు, శ్రీనుల ఆధ్వర్యంలో ఎనిమిది బృందాలను ఏర్పాటుచేశారు. దాసరి వెంకన్న, అతని భార్య నాగమణి, కుమారుడు (14)లు విస్సన్నపేట మండలం కొండపర్వలో ఉన్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేశారు. బాలుడు మైనర్‌ అయినందున జ్యూవైనల్‌ హోమ్‌కు తరలించి మిగతా ఇద్దరిని కోర్టుకు హాజరు పర్చుతామని ఎస్పీ తెలిపారు. 

సిబ్బందికి రివార్డులు  
24 గంటల్లో కేసును చేధించిన నందిగామ, నూజివీడు డీఎస్పీలు రమణమూర్తి, శ్రీనివాసులుకు ప్రశంసలు, సీఐలు శేఖర్‌బాబు, శ్రీను, ఎస్‌ఐలు లక్ష్మణ్, శివనారాయణ, సుబ్రహ్మణ్యం, మహేష్‌, శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, ధర్మారాజు, రాంబాబులను అభినందించి రివార్డులు అందజేశారు. 

మరిన్ని వార్తలు