వీడిన మిస్టరీ: నటించి.. నమ్మించి.. ఏమీ ఎరగనట్టుగా..

3 Aug, 2021 10:45 IST|Sakshi
హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర

బావమరిదే సూత్రధారి

వీడిన మాజీ సైనికుడి హత్య కేసు మిస్టరీ

అంతమొందించేందుకు ఆరు లక్షల సుపారీ

ఐదుగురు నిందితులు అరెస్టు

పరారీలో ఒకరు

వివరాలు వెల్లడించిన డీఎస్పీ మహేంద్ర 

ఆస్తి తగాదాలు నిండు ప్రాణాన్ని నిర్ధాక్షిణ్యంగా తీసేశాయి. అనాలోచిత నిర్ణయాలు.. సోదరి పసుపు కుంకాల్ని చెరిపేశాయి. ఆరు లక్షల రూపాయల సుపారీ కోసం.. కిరాయి మూకలు మనిషిని మట్టుబెట్టాయి. నగరంలో సంచలనం సృష్టించిన మాజీ సైనికుడి హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో బోలెడు కోణాలు వెలుగుచూశాయి. సూత్రధారి సొంత బావమరిది అని పోలీసులు చెప్పారు. పాత్రధారులు ఐదుగురని తేల్చారు. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నారు.  

శ్రీకాకుళం: శ్రీకాకుళం నగర శివార్లలోని విజయాదిత్య పార్కులో గత నెల 25న జరిగిన చౌదరి మల్లేశ్వరరావు హత్య అతని బావమరిది సీపాన అప్పలనాయుడు ప్రోద్బలంతోనే జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మహేంద్ర సోమవారం విలేకరులకు వెల్లడించారు.

చౌదరి మల్లేశ్వరరావు ఆర్మీలో పనిచేసి 2012లో ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం సింహద్వారం సమీపంలో మీ–సేవ కేంద్రాన్ని నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. మల్లేశ్వరరావు భార్య లలిత సోదరుడు సీపాన అప్పలనాయుడుతో కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేశారు. ఈ క్రమంలో అప్పలనాయుడు ఎచ్చెర్ల మండలం పూడివలస సమీపంలో 45 సెంట్లు, మరో చోట 85 సెంట్ల డీ పట్టా భూమిని కొనుగోలు చేశాడు.

తరువాత శ్రీకాకుళం సింహద్వారం సమీపంలో డీ పట్టా స్థలంలో రెండంతస్తుల భవనం నిర్మించారు. ఈ ఆస్తులన్నీ తన బావ చౌదరి మల్లేశ్వరరావు పేరునే ఉన్నాయి. రెండంతస్తుల భవనానికి నెలకు రూ.25 వేలు అద్దెగా వస్తుండేది. పై అంతస్తులోనే మల్లేశ్వరరావు నివాసం ఉండేవారు. ఈ అద్దెను మూడు నెలల క్రితం వరకు అప్పలనాయుడే వసూలు చేసుకునేవారు.

అద్దె వసూలుతో వివాదం.. 
మూడు నెలల నుంచి మల్లేశ్వరరావు ఆ అద్దెను వసూలు చేసుకుంటూ ఆస్తి తన పేరునే ఉందని, ఇదంతా తనదేనని అనడంతో మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో బావకు కాలు, చేయి విరగ్గొట్టాలని అప్పలనాయుడు పథకం రచించాడు. పడాల శేఖర్, బొద్దాన శ్రీరామ్మూర్తి అనే వ్యక్తులతో సుపారీకి మాట్లాడాడు. అది కుదరకపోవడంతో ఏకంగా హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. పై ఇద్దరితోపాటు పందిరిపల్లి సత్యనారాయణ అనే వ్యక్తిని కూడా పథకరచనలో భాగస్వామిని చేశారు. వీరికి సిరిపురం ఈశ్వరరావు అనే వ్యక్తి కూడా సహకరించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది.

విశాఖ నుంచి మహిళను రప్పించి.. 
వీరంతా కలిసి మల్లేశ్వరరావును రప్పించేందుకుగాను విశాఖపట్టణానికి చెందిన కనకమహాలక్ష్మి అనే మహిళతో మాట్లాడారు. ఆమెను వరుసగా మూడు రోజులు మీ–సేవ కేంద్రానికి పంపించి మల్లేశ్వరరావు ఆమె ఉచ్చులో పడినట్లు చేశారు. గత నెల 25న కనకమహాలక్ష్మి రాత్రి 9.30 గంటల సమయంలో మల్లేశ్వరరావుకు ఫోన్‌చేసి విజయాదిత్య పార్కుకు రావాలని కోరడంతో అక్కడికి వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న పందిరిపల్లి సత్యనారాయణ, పడాల శేఖర్, బి.శ్రీరామ్మూర్తి, సిరిపురం ఈశ్వరరావులు మల్లేశ్వరరావు మెడకు చున్నీని బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అటు తరువాత మృతదేహాన్ని అక్కడే వదిలి నలుగురు సింహద్వారం వరకు వచ్చి పని పూర్తయినట్లు సీపాన అప్పలనాయుడుకు తెలియజేశారు.

రూ.6 లక్షలు సుపారీకి ఈ హత్యను ఒప్పుకోగా అదే రోజున రెండున్నర లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తం కోసం గత నెల 31న నవభారత్‌ జంక్షన్‌ వద్దకు రాగా పోలీసులు ఐదుగురినీ అదుపులోకి తీసుకున్నారు. ఈశ్వరరావు పరారీలో ఉన్నాడు. వీరి నుంచి నగదుతోపాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ చెప్పారు. కేసును వారం రోజుల్లో ఛేదించిన టూటౌన్‌ సీఐ ఆర్‌ఈసీహెచ్‌ ప్రసాద్, ఎస్‌ఐ శ్రీధర్, మహిళా ఎస్‌ఐ ఎం. ప్రవళ్లికతో పాటు ఏఎస్‌ఐ ఎల్‌. జగన్మోహనరావు, హెచ్‌సీ పి.వేణుగోపాలరావు, కానిస్టేబుళ్లు సీహెచ్‌వీ రమణ, పీఎస్‌ఎస్‌ ప్రకాష్, ఎంవీ రమణ, వై.రామశంకర్, డి.రామారావులను డీఎస్పీ అభినందించారు. 

బావ హత్యకు పథకం రచించి హత్య చేయించిన అప్పలనాయుడు ఏమీ ఎరగనట్టుగా గత నెల 25 రాత్రి గ్రామస్తులతో కలిసి మల్లేశ్వరరావు కోసం వెతకడం.. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.    

మరిన్ని వార్తలు