కులాంతర వివాహంతోనే హత్య

23 Jun, 2022 10:15 IST|Sakshi

రాప్తాడు: ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించిన చిట్రా మురళి హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రానికి చెందిన కురుబ చిట్రా నాగన్న, ముత్యాలమ్మ దంపతుల కుమారుడు చిట్రా మురళి, అదే గ్రామంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన ములుగూరు రామానాయుడు (లేట్‌), యశోదమ్మ దంపతుల కుమార్తె వీణలు ప్రేమించుకున్నారు. గతేడాది జూన్‌ 23న ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వివాహం చేసు కున్నారు. కొన్ని రోజుల తర్వాత రాప్తాడు ఎస్సీ కాలనీలో కాపురం పెట్టారు. మురళి కియా కంపెనీలో ఉద్యోగానికి కుదరగా, వీణ కనగానపల్లి మండలం ఎలక్కుంట్ల సచివాలయంలో మహిళా పోలీస్‌గా విధులు నిర్వర్తించేది.  

మురళిని కడతేర్చుతానని యశోదమ్మ శపథం  
కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేని వీణ తల్లి యశోదమ్మ రగిలిపోయేది. కొన్ని రోజుల క్రితం కూతురితో మాట్లాడిన ఆమె నీ మొగుణ్ణి కడతేర్చుతానని శపథం చేసింది. తన బంధువులైన అప్పన్న గారి వెంకటేశులు (అనంతపురం), సుబ్రమణ్యం (మాజీ సర్పంచ్, కనగానపల్లి) ద్వారా అనంతపురానికి చెందిన సాకే సర్దార్‌తో మురళిని హత్య చేసేందుకు రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుంది. రూ.2 లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చి మిగతా మొత్తం హత్య తర్వాత ఇస్తామని చెప్పింది. రంగంలోకి దిగిన సర్దార్‌ తన ముఠా సభ్యులైన రవి, సయ్యద్‌ సద్దాం, పెనకలపాటి సుబ్రమణ్యం అలియాస్‌ మణి, పెనకలపాటి ప్రకాష్‌తో కలిసి మురళి హత్యకు రెక్కీ నిర్వహించాడు. కియా కంపెనీకి వెళ్లేందుకు మురళి రోజూ రాప్తాడు సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు కోసం వేచి ఉండడం గమనించాడు.

ఎప్పటిలాగే మురళి ఈ నెల 16న వేచి ఉండగా నలుగురూ కలిసి ఓ ఆటోలో కిడ్నాప్‌ చేశారు. బొమ్మేపర్తి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి కత్తులతో విచక్షణారహితంగా గొంతు కోసి హత్య చేశారు. దీనిపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం అనంతపురం మండలం సోమలదొడ్డిలో 8 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆటో, బైక్, 2 చాకులు, 8 సెల్‌ఫోన్లతో పాటు రూ.4.70 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. హత్య జరిగిన 6 రోజుల్లోనే కేసును ఛేదించిన డీఎస్పీ శ్రీనివాసులు     బృందాన్ని ఎస్పీ ఫక్కీరప్ప అభినందించారు. కార్యక్రమంలో ఇటుకల పల్లి సీఐ మురళీధర్, ఎస్‌ఐ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

(చదవండి: రాధ మిస్సింగ్‌ కేసు: హైకోర్టు అడ‍్వకేట్‌ శిల్ప ఇంట్లో ఎన్‌ఐఏ తనిఖీలు)

మరిన్ని వార్తలు