Telangana: గంజాయి కట్టడికి మూడంచెలు

23 Oct, 2021 03:35 IST|Sakshi

జిల్లా, రాష్ట్ర, అంతర్రాష్ట్ర కమిటీల రూపకల్పన 

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు 

ఫూట్‌ పెట్రోలింగ్‌ వ్యవస్థకు శ్రీకారం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరా, స్మగ్లింగ్‌ను నియంత్రించేందుకు పోలీస్‌ శాఖ, ఎక్సైజ్‌ విభాగాలు నడుం బిగించాయి. ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తున్నాయి. మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ పోలీస్, ఎక్సైజ్‌ విభాగాలతో గంజాయి నియంత్రణపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాలకనుగుణంగా మూడంచెల వ్యవస్థను ఏర్పాటుచేసే పనిలో పోలీస్, ఎక్సైజ్‌ విభాగాలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి.  

పటిష్టమైన నిఘా.. 
ఇతర రాష్ట్రాల నుంచి రవాణా అవుతున్న గంజాయితోపాటు రాష్ట్రంలో సాగువుతున్న గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు అంతర్రాష్ట్ర, రాష్ట్ర, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నేతృత్వంలో జిల్లా కమిటీ గంజాయి నియంత్రణకు కృషి చేస్తుంది. అదేవిధంగా ఎక్సైజ్‌ కమిషనర్, శాంతి భద్రతల అదనపు డీజీపీ నేతృత్వంలోని రాష్ట్ర కమిటీ జోనల్‌ ఐజీలతో నియంత్రణ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక పోలీస్, ఎక్సైజ్‌ విభాగాలతో నిరంతరం సమాచార మార్పిడి చేసుకునేలా అంతర్రాష్ట్ర కమిటీ చర్యలు చేపట్టనుంది.  

సరిహద్దుల్లో చెక్‌పోస్టులు 
ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలో ప్రవేశించే పాయింట్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటుచేయాలని ఇరు విభాగాలు నిర్ణయించాయి. ఇందుకోసం పోలీస్‌ శాఖ బెటాలియన్ల నుంచి 10 మంది సాయుధ బలగాలను ఒక్కో చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేయనుంది. ఎక్సైజ్‌ విభాగం సైతం ఆయా జిల్లాల పరిధి నుంచి 10 మంది సిబ్బందిని అక్కడ నియమించనున్నట్లు తెలిసింది. ఈ చెక్‌పోస్టులను ఇరు విభాగాల సీఐ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు.

ఇలా ఏపీ–తెలంగాణ సరిహద్దులో, మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దు (నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో), కర్ణాటక–తెలంగాణ సరిహద్దు (వికారాబాద్, మహబూబ్‌నగర్‌)లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ రైల్వే పోలీస్‌ (జీఆర్‌పీ), ఎక్సైజ్‌ శాఖ నేతృత్వంలో రైళ్లలో నిఘాను పెంచి గంజాయి రవాణాను కట్టడి చేయాలని భావిస్తున్నారు. ప్రతీ మండల పరిధిలో ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు చేస్తున్న వారి వివరాలను కనిపెట్టి వాటిని ధ్వంసం చేయాలని ఇప్పటికే పోలీస్‌ నిఘా వ్యవస్థ అధికారులను ఆదేశించింది. 

రొటేషన్‌ పద్ధతిలో కేసులు.. 
రెండు విభాగాలకు కేసులు నమోదు చేసే అధికారం ఉండటంతో ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు రొటేషన్‌ పద్ధతిలో కేసుల నమోదుకు నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఒక కేసు పోలీస్‌ శాఖ, ఒక కేసు ఎక్సైజ్‌ విభాగం నమోదు చేసేలా వెసులుబాటు చేసుకున్నట్టు తెలిసింది. దీనివల్ల న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉంటాయని భావిస్తున్నారు. 

హైదరాబాద్‌లో మొదలైన ఆపరేషన్‌ 
ఇప్పటికే హైదరాబాద్‌లో పోలీస్‌–ఎక్సైజ్‌ శాఖ నేతృత్వంలో ఆపరేషన్‌ గాంజా ప్రారంభించారు. నగర కమిషనరేట్‌ ప«రిధిలోని వెస్ట్‌ జోన్‌ జాయింట్‌ సీపీ–ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు కమిషనర్‌ అజయ్‌రావ్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఇం దులో భాగంగా నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్స్, గంజాయి అమ్మకాలు జరిపే హాట్‌ పాయింట్స్‌లో పోలీస్‌–ఎక్సైజ్‌ సిబ్బందిని మఫ్టీలో రంగంలోకి దించారు. 

ఫూట్‌ పెట్రోలింగ్‌ 
గంజాయి అమ్మకందారులు, కొనుగోలుదారులు, స్మగ్లర్లను గుర్తించేందుకు మొదటిసారి రెండు విభాగాల నేతృత్వంలో ఫూట్‌ పెట్రోలింగ్‌ (కాలినడక గస్తీ) చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పది మంది సిబ్బంది హాట్‌ స్పాట్స్‌లో గస్తీ కాస్తారని, అనుమానిత వ్యక్తులు, కారణం లేకుండా ప్రాంతాలు సందర్శించే వారిని గుర్తించి తనిఖీలు చేయడంతోపాటు ప్రశ్నిస్తారని ఉన్నతాధికారులు తెలిపారు.    

మరిన్ని వార్తలు