అంతర పంటగా గంజాయి!

7 Oct, 2021 02:52 IST|Sakshi
గంజాయి మొక్కలను ధ్వంసం చేస్తున్న ఎక్సైజ్, పోలీసులు

సాక్షి, సంగారెడ్డి(మెదక్‌): ఆంధ్ర, ఒడిశా సరిహద్దులకు పరిమితమైన గంజాయి సాగు ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లోనూ విస్తరిస్తోంది. ప్రధానంగా సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలో విస్తారంగా సాగవుతోంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని కర్ణాటక సరిహద్దు మారుమూల గ్రామాల్లో గంజాయి క్షేత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా వేల సంఖ్యలో గంజాయిని సాగు చేస్తున్న క్షేత్రాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్న పొలాలను తరచూ గుర్తిస్తున్న ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు మొక్కలను ధ్వంసం చేసి కేసులు నమోదు చేస్తున్నారు.  

ఒకేచోట రూ.ఐదు కోట్ల విలువైన మొక్కలు 
► సంగారెడ్డి జిల్లా ఏడాకులపల్లి గ్రామ శివారులో వెంకటేశ్‌ అనే వ్యక్తికి చెందిన ఐదెకరాల్లో ఇటీవల మూడు వేలకు పైగా గంజాయి మొక్కలు సాగవుతున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. ఈ గంజాయి మొక్కల విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటించారు. 
► కర్ణాటక సరిహద్దు జహీరాబాద్‌ డివిజన్‌లోని పలు గ్రామాల్లో 12 గంజాయి క్షేత్రాలను ఎక్సైజ్, పోలీసుశాఖ అధికారులు గుర్తించి, వేల సంఖ్యలో మొక్కలను ధ్వంసం చేశారు. రాయ్‌కోడ్‌ మండలం ఉలిగెరలో నాలుగు వేల మొక్కలను గుర్తించారు. పత్తి, చెరుకు, అరటి తోటల్లో భారీగా గంజాయి సాగవుతోంది. 
► బాన్సువాడ మండలంలోని సోమ్లానాయక్‌ తం డాలో, గాంధారి మండలం ధన్‌సింగ్‌తండా శివా రులోనూ ఇటీవల గంజాయి సాగవుతున్నట్లు గు ర్తించి మొక్కలను దహనం చేశారు. రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలోనూ గంజాయి క్షేత్రాలపై ఇటీవల అధికారుల దాడులు కొనసాగాయి. 

జైళ్లలో మగ్గుతున్నది రైతులే.. 
ముంబైకి చెందిన స్మగ్లింగ్‌ ముఠాలు తమ ఏజెంట్ల ద్వారా ఇక్కడి అమాయక రైతులను ట్రాప్‌ చేసి గంజాయిని సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. కొందరు రైతులు స్థానికేతరుల భూములు కౌలుకు తీసుకొని అందులో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎక్సైజ్‌ అధికారి అశోక్‌కుమార్‌ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ పంట సాగుతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తుండటంతో కొందరు అమాయక రైతులు దీనివైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పట్టుబడితే నెలల తరబడి జైలులో మగ్గుతున్నారు. గంజాయి సాగుచేస్తున్న అమాయక రైతులు ఎన్‌డీపీఎస్‌ వంటి కేసులను ఎదుర్కొంటుండగా, ముంబైలో కూర్చుని రూ.కోట్లు గడిస్తున్న దందా సూత్రధారులపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

ఇద్దరు మైనర్లపై కేసు 
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మేడిపల్లి గ్రామంలో ఇద్దరు బాలురు తమ వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం వ్యవసాయ క్షేత్రంలో తనిఖీలు చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు మూడు నెలల క్రితం తమ వ్యవసాయ క్షేత్రంలో గంజాయి విత్తనాలు నాటారని సమాచారం అందిందని మెట్‌పల్లి సీఐ శ్రీను వివరించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

చదవండి: Singareni Employees: ఒక్కో కార్మికుడికి రూ.1.15 లక్షలు

మరిన్ని వార్తలు