‘ఈ ఒక్కరోజు వినండి సర్‌.. ప్లీజ్‌’

26 Jan, 2021 12:14 IST|Sakshi

పోలీసుల అదుపులో పురుషోత్తంనాయుడు, పద్మజ

సాక్షి, చిత్తూరు: తమ ఇద్దరు కుమార్తెలు అలేఖ్య(27), సాయిదివ్య(22)ను ఇంట్లో కిరాతకంగా హత్యచేసిన తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లి తాలూకా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. జంట హత్యల కేసులో A 1గా పురుషోత్తం నాయుడు, A 2 గా పద్మజను చేర్చారు. మంగళవారం సాయంత్రం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కాగా తమ ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులతో పద్మజ మరోసారి గొడవకు దిగారు. దేవుడి గదిలోకి బూట్లు వేసుకుని రావొద్దని, ఫొటోలు తీయొద్దని విజ్ఞప్తి చేశారు.(చదవండి: మూఢనమ్మకంతోనే.. బలిచేశారు)

అదే విధంగా.. ‘‘నా బిడ్డల్ని వాళ్లకు ఎందుకు చూపిస్తున్నారు. నువ్వు చేసిన పని వల్లే కదా అయ్యా ఇదంతా జరిగింది’’ అని భర్త పురుషోత్తం నాయుడును నిందించారు. ఇక తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని పోలీసులను వేడుకున్న పద్మజ.. ‘‘ఈ ఒక్కరోజు వినండి ప్లీజ్‌ సర్‌. రేపటి లోగా నా బిడ్డలు బతికి వస్తారు. ఈ ఒక్కరోజు వదిలేయండి. మీ కాళ్లకు మొక్కుతా సర్‌’’ అంటూ విలపించారు. పోలీసులు తీసుకువెళ్తున్న సమయంలోనూ చేతులతో సైగలు చేస్తూ ఆమె విచిత్రంగా ప్రవర్తించారు.

నేనే శివుడిని నాకు కరోనా టెస్టు ఏంటి?: పద్మజ
కూతుళ్లను హత్య చేసిన పద్మజ మూఢనమ్మకాలతో పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. కరోనా టెస్టుకు తీసుకెళ్లిన పోలీసులకు ఆమె చుక్కలు చూపించారు. కరోనా చైనా నుంచి రాలేదని, చెత్తను కడిగేయడానికి తన శరీరం నుంచి తానే వైరస్‌ను పంపించానంటూ బిగ్గరగా కేకలు వేశారు. తానే శివుడినని, తనకు ఏ టెస్టు అవసరం లేదంటూ గందరగోళం సృష్టించారు.

మరిన్ని వార్తలు