Assam ఆక్రమణదారులపై పేలిన పోలీసు తూటా

24 Sep, 2021 04:22 IST|Sakshi
కింద పడిన వ్యక్తిని విజయ్‌ తన్నుతున్న దృశ్యం

ఇద్దరు మృతి

తారస్థాయిలో ఘర్షణలు

లాఠీలతో చితకబాదిన పోలీసులు

గువాహటి: అసోంలోని దరాంగ్‌ జిల్లా సిఫాజర్‌లో ఆక్రమణదారుల తరలింపు ప్రక్రియ హింసాత్మకంగా మారింది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య గురువారం జరిగిన ఘర్షణలు రణరంగాన్ని తలపించాయి. ఖాకీల తూటాలకు ఇద్దరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వ్యవసాయానికి సంబంధించిన ఒక ప్రాజెక్టు కోసం కావల్సిన భూసేకరణలో భాగంగా ధోల్‌పూర్‌లోని సిఫాజర్‌లో 800 కుటుంబాలను తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ స్థలమే అయినప్పటికీ కొన్ని దశాబ్దాల నుంచి ఆ కుటుంబాలు అక్కడే నివాసం ఉంటున్నాయి.
చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం

వారిని అక్కడ్నుంచి ఖాళీ చేసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రభుత్వం మొదలు పెట్టింది. అయితే దీనిని వ్యతిరేకించిన ఆ కుటుంబాలు తమకు పునరావాసం కల్పించాలంటూ నిరసనలకు దిగారు. వారిని చెదరగొట్టడానికి లాఠీలు, తుపాకీలతో పోలీసులు క్రౌర్యాన్ని ప్రదర్శించారు. విచక్షణా రహితంగా నిరసనకారుల్ని చితకబాదడమే కాకుండా వారిపై నేరుగానే కాల్పులు  జరిపారు. ఈ ఘర్షణలన్నింటినీ వీడియో తీయడానికి జిల్లా యంత్రాంగం నియమించిన కెమెరామ్యాన్‌ విజయ్‌శంకర్‌ బనియా నిరసనకారులపై అత్యంత దారుణంగా ప్రవర్తించారు.  బుల్లెట్‌ గాయంతో ప్రాణాలు కోల్పోయి నేలపై పడి ఉన్న ఒక వ్యక్తిని విజయ్‌శంకర్‌ కాళ్లతో తన్నిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

దీంతో ప్రభుత్వం ఆ కెమెరామ్యాన్‌ అరెస్ట్‌ చేసింది. ఈ ఘటనలపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తంకావడంతో అస్సాం ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. మరోవైపు నిరసనకారులు పోలీసులపైకి పదునైన ఆయుధాలు, రాళ్లతో దాడి చేశారని, వారు చేసిన దాడిలో ఎనిమిది మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని దరాంగ్‌ ఎస్పీ, ముఖ్యమంత్రి హిమాంత్‌ బిశ్వా సోదరుడు సుశాంత్‌ బిశ్వా శర్మ చెప్పారు. గువాహటి మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మొనిరుద్దీన్‌ పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని సద్దామ్‌ హుస్సేన్, షేక్‌ ఫోరిడ్‌గా గుర్తించారు. అస్సాం ప్రభుత్వమే కాల్పుల్ని స్పాన్సర్‌ చేస్తోందని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. బీజేపీ సర్కార్‌ అధికారంలోకొచ్చాక ప్రజలపై వేధింపులు పెరిగినట్లు అస్సాం పీసీసీ అధ్యక్షుడు భూపేన్‌ బోరా అన్నారు.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం

మరిన్ని వార్తలు