హుండీలో నగదు లేదని..దేవుని విగ్రహాలు ధ్వంసం

14 Aug, 2021 08:03 IST|Sakshi
జలుమూరు పోలీస్‌స్టేషన్‌ వద్ద వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మహేంద్ర. వెనుక నిందితుడు సంజయ్‌

సాక్షి,జలుమూరు: డబ్బు కోసం హుండీని కొల్లకొట్టాడు. అందులో ఏమీ దొరక్కపోవడంతో ఆ కోపాన్ని సమీపంలో ఉన్న విగ్రహాలపై చూపించి ధ్వంసం చేశాడు. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ ఎం.మహేంద్ర, నరసన్నపేట సీఐ ఎం.తిరుపతిరావులు జలుమూరు పోలీస్‌స్టేషన్‌ వద్ద విలేకరులకు వివరాలు వెల్లడించారు. జలుమూరు మండలం పద్మనాభ కొండపై లక్ష్మీదేవి, దుర్గామాత, వినాయక వాహనం ఎలుక విగ్రహాలు జూలై 24న ధ్వంసమయ్యాయని, ఇందుకు బాధ్యుడిగా సైరిగాం గ్రామానికి చెందిన చెరుకుపల్లి సంజయ్‌గా గుర్తించామని చెప్పారు. ఈయన తాబేళ్లు, ఉడుములు పట్టుకుని పద్మనాభ కొండపైకి వెళ్లి ఎవరూ లేకపోవడంతో ఆలయం హుండీని పగలుకొట్టాడని తెలిపారు.

అందులో నగదు లేకపోవడంతో కోపానికి గురై విగ్రహాల ధ్వంసానికి పాల్పడినట్లు చెప్పారు. ఆరు నెలల క్రితం కూడా ఇదే ఆలయం హుండీని కొట్టేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు హెచ్చరించి వదిలేశారని పేర్కొన్నారు. 20 రోజుల క్రితం కూడా సంజయ్‌ ఇక్కడికి వచ్చినట్లు గ్రామస్తులు గుర్తించారని తెలిపారు. విగ్రహాల ధ్వంసం అనంతరం ఒడిశా వెళ్లిపోయిన ఈయన ఆధార్‌ కార్డుతోపాటు కుటుంబాన్ని తీసుకెళ్లేందుకు స్వగ్రామం సైరిగాం వచ్చాడని, ఈ క్రమంలోనే కొమనాపల్లి వద్ద పట్టుకున్నామని చెప్పారు. ఆలయ అర్చకుడు అగస్తి నారాయణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ ఆర్‌.దేవానంద్‌ తెలిపారు. అనంతరం కోటబొమ్మాళి కోర్టులో హాజరుపరిచామన్నారు.  

మరిన్ని వార్తలు