రూ. కోట్ల విలువైన భూమికి స్కెచ్‌.. బీజేపీ నేత అరెస్టు 

5 Sep, 2021 12:33 IST|Sakshi
తప్పుడు జీపీఏతో అమ్మ జూపిన కొమ్మాదిలోని భూమి ఇదే

 రూ. కోట్ల విలువైన భూమికి స్కెచ్‌

మోసం చేసి అమ్మేందుకు ప్రయత్నించిన 

బీజేపీ నేత శ్రీనివాసరావు అరెస్టు 

రిమాండ్‌కు తరలించిన పీఎంపాలెం పోలీసులు

సాక్షి, విశాఖపట్నం/మధురవాడ (భీమిలి): కొమ్మాదిలో రూ.కోట్ల విలువైన 12.26 ఎకరాల స్థలానికి తప్పుడు జీపీఏ సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు యత్నించిన అల్లిపురానికి చెందిన బీజేపీ కోశాధికారి జరజాపు శ్రీనివాసరావును పీఎం పాలెం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తన భర్త పేరున ఉన్న ఈ భూమిని తప్పుడు పత్రాలు సృష్ణించి విక్రయించాలని చూస్తున్నారని గత బుధవారం పీఎంపాలెం పోలీసుస్టేషన్‌లో బాధితుడు కృష్ణచౌదిరి భార్య లక్ష్మీసూర్య ప్రసన్న ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.  విశాఖ రూరల్‌ మండలం కొమ్మాది రెవెన్యు గ్రామం సర్వే నంబరు.

53/1 నుంచి 4 సబ్‌ డివిజన్‌లు, 54/2, 54/4, 54/5, 54/6 తదితర సబ్‌ డివిజన్‌లలో అమెరికాలో ఉంటున్న తుమ్మల కృష్ణ చౌదరికి 12.26 ఎకరాలు విలువైన భూమి ఉంది. సుమారు వంద కోట్లు విలువ చేసే భూమికి తప్పుడు జీపీఏ సృష్టించి అల్లిపురానికి చెందిన బీజేపీ కోశాధికారి జరజాపు శ్రీనివాసరావు బేరం పెట్టాడు. కొనుగోలుకు సిద్ధపడిన కొంతమంది దీనిపై పత్రిక ప్రకటన ఇచ్చారు. వారం రోజుల వరకు ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో భూమి కొనుగోలుకు వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు రూ.3.49 కోట్లు అడ్వాన్సుగా అకౌంట్‌లో జమచేశారు. అయితే కృష్ణ చౌదరి పేరుమీద ఐసీఐసీఐ బ్యాంకు కూర్మన్నపాలెం బ్రాంచిలో తప్పుడు ధ్రువపత్రాలతో ఖాతా తెరిచాడు. ఈ ఖాతా నుంచి చౌదరి భార్య ఖాతాకు రూ.60 లక్షలు బదిలీ అవడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.  

భూ యజమాని అమెరికాలో.. 
ఈ భూమికి సంబంధించిన యజమాని అమెరికాలో ఉండడంతో జీపీఏని అమెరికాలో ఆగస్టు 5న తయారు చేయించి అక్కడ ఇండియా ఎంబసీలో అనుమతితో ఇండియాకు పంపించినట్లు తప్పడు పత్రాలు సృష్టించారు. గత నెల 23న  జిల్లా రిజిస్ట్రార్‌ వేలిడేషన్‌ తర్వాత 26వ తేదీన మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చింది. దీనికి మార్కెట్‌ విలువ తక్కుగా వెయ్యడంతో డాక్యుమెంట్‌ను పెండింగ్‌లో పెట్టి  సబ్‌ రిజిస్ట్రార్‌ దీనిపై పునఃపరిశీలన చేసి వాస్తవాలు పరిశీలించాలని జిల్లా రిజిస్ట్రార్‌కు గత నెల 31న పంపించారు. ఇది ఇలా ఉండగా పేపరు ప్రకటన తర్వాత భూ యజమాని భార్య తుమ్మల లక్ష్మి సూర్యప్రసన్న తెరమీదకు వచ్చారు. దీనిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంలో రూ.3.49 కోట్లు ఐసీఐసీఐ బ్యాంకు కూర్మన్నపాలెం బ్యాంకులో తప్పుడుపత్రాలతో కృష్ణచౌదిరి పేరిట ఉన్న అకౌంట్‌లోకి జమ అయ్యాయి.  ఈ అకౌంట్‌ నుంచి రూ.60 లక్షలు కృష్ణచౌదిరి భార్య ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ అవ్వడంతో ఈకేసు కొత్త మలుపు తిరిగింది. ఈనగదు తాను సూర్య నుంచి అప్పుగా తీసుకున్నానని ఆమె బుకాయిస్తున్నప్పటికీ అందుకు తగిన ఆధారాలు లేవని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈనేపథ్యంలో బ్యాంక్‌ అధికారుల పాత్రతోపాటు ఈమె పాత్రకూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

బాధ్యులందరినీ అరెస్టు చేస్తాం: సీఐ 
ఈ కేసులు తప్పుడు జీపీఏ సృష్టించి ప్రైవేటు భూమిని అమ్మేసేందుకు ప్రయత్నించిన అల్లిపురం, రామాలయం వీధికి చెందిన జరజాపు శ్రీనివాసరావు(51)ని ఐపీసీ 467, 468, 471, 120 కింద అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్టు పీఎంపాలెం పోలీసు సీఐ రవికుమార్‌ చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నారనేదానిపై లోతుగా విచారణ లోతుగా చేస్తున్నామని వారందరినీ కూడా అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు.   

మరిన్ని వార్తలు