ఈ అక్షయ పాత్రతో నీళ్లు తాగితే పాము కాటు వేసిన ఏం కాదు!

25 Mar, 2021 08:12 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న అక్షయపాత్ర

రూ.5 లక్షలు వసూలు చేసేందుకు

అక్షయపాత్ర పేరుతో మోసం 

సాక్షి, జగిత్యాలక్రైం: అక్షయపాత్ర కొనుగోలు చేసి, ఇంట్లో పెట్టుకుంటే కోటీశ్వరులు అవుతారని గ్రామీణ ప్రాంతాల్లో అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న ముఠాను జగిత్యాల పట్టణ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. టౌన్‌ సీఐ జయేశ్‌రెడ్డి, జగిత్యాలరూరల్‌ సీఐ కృష్ణకుమార్‌ల వివరాల ప్రకారం.. జగిత్యాల అర్బన్‌ మండలం హస్నాబాద్‌కు చెందిన కడప శ్రీనివాస్‌ జగిత్యాల బీట్‌బజార్‌కు చెందిన రాయిల్ల సాయికుమార్‌ను సంప్రదించాడు. అతను హైదరాబాద్‌కు చెందిన దండె కార్తీక్, బవికుమార్, మంచిర్యాలకు చెందిన బోడకుంట మురళీమనోహర్, ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన యాదగిరి అఖిల్‌కుమార్‌లను శ్రీనివాస్‌ వద్దకు తీసుకువచ్చాడు.

మహిమ గల అక్షయపాత్ర తమ వద్ద ఉందని, ఇందులో నీరు పోసుకొని ప్రతిరోజూ ఉదయం కుటుంబసభ్యులందరూ తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. పాముకాటు వేసినా ఏం కాదని నమ్మించారు. పూజ గదిలో పెట్టి పూజిస్తే కోటీశ్వరులు అవుతారని పేర్కొన్నారు. రూ.5 లక్షలు ఇస్తే అక్షయపాత్ర ఇస్తామన్నారు. అనుమానం వచ్చిన శ్రీనివాస్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జగిత్యాల టౌన్‌ సీఐ జయేశ్‌రెడ్డి, జగిత్యాలరూరల్‌ సీఐ కృష్ణకుమార్‌ బుధవారం రావుల సాయికుమార్‌ ఇంటికి వెళ్లారు. అతన్ని అదుపులోకి తీసుకొని, అక్షయపాత్ర స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు చెందిన మిగతా సభ్యులను సైతం అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు