రూ. 23,100కే రైల్వే జాబ్‌!

18 Mar, 2021 08:20 IST|Sakshi
హర్ష బర్దన్‌ మిశ్రా

ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు ఇచ్చిన కోల్‌కతా వాసి 

సంప్రదించిన వారితో షైన్‌.కామ్‌లో రిజిస్ట్రేషన్‌ 

ఆపై వివిధ పేర్లు చెప్పి చిన్న మొత్తాలు వసూలు 

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 మంది బాధితులు 

నిందితుడిని అరెస్టు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు  

సాక్షి, హైదరాబాద్‌: ఓఎల్‌ఎక్స్‌లో రైల్వే ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చి, సంప్రదించిన వారితో షైన్‌.కామ్‌లో రిజిస్టర్‌ చేయించి, వివిధ చార్జీల పేరుతో రూ. 23,100 వరకు వసూలు చేసి, మోసం చేసే ముఠా సూత్రధారిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధితుడి ద్వారా నిందితుడిని కోల్‌కతాలో పట్టుకున్న అధికారులు పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించిన అనంతరం కోర్టు అనుమతితో బుధవారం సైబర్‌ కాప్స్‌ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠా చేతిలో దేశ వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది మోసపోయారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్యే 20 మంది వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురి ఫిర్యాదులతో కేసులు నమోదు కాగా... మరో 12 మందిని గుర్తించామని, మిగిలిన ఐదుగురి కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు.  

⇔ కోల్‌కతా, హుగ్లీలోని చందన్‌నగర్‌కు చెందిన హర్ష బర్దన్‌ మిశ్రా బీసీఏ పూర్తి చేశాడు. ఆపై కొన్ని ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసిన ఇతగాడు ప్రస్తుతం అక్కడి నరూ రోయ్‌పర ప్రాంతంలో ఇన్ఫర్మేషన్‌ ఐటీ టెక్నాలజీ గ్రూప్‌ అండ్‌ ఏఎస్‌ ఇన్ఫోసాల్వ్‌ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. 
⇔ పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన బినిత పాల్, రిచ, అనితలను ఉద్యోగులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఐదుగురూ కలిసి ఆన్‌లైన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా అనేక మందిని ఉద్యోగాల పేరుతో ఎర వేసి మోసం చేస్తున్నారు.  
⇔ ఓఎల్‌ఎక్స్‌లో రైల్వేతో పాటు డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చే వీరు అందులో తమ ఫోన్‌ నంబర్లను పొందుపరుస్తున్నారు. వీటిని చూసి ఎవరైనా కాల్‌ చేస్తే.. వారి వివరాలను షైన్‌.కామ్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచిస్తున్నారు.  
⇔ ఆ తర్వాత రెండు రోజుల్లో నిందితులు బాధితులకు ‘హెచ్‌ఆర్‌ రిచ’, ‘హెచ్‌ఆర్‌ జాస్మిన్‌’ పేర్లతో బల్క్‌ మెసేజ్‌లో పంపుతున్నారు. ఉద్యోగార్థుల్లో అత్యధికులు రైల్వే ఉద్యోగాలే కోరుతుండటంతో ఆ డిపార్ట్‌మెంట్‌లో సైట్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు అర్హులయ్యారంటూ చెబున్నారు. మరికొందరితో ప్యాంటరీకార్స్‌లో పోస్టుల పేరు చెప్తున్నారు. 
⇔ నెలకు రూ.13,500 నుంచి రూ.15,500 వరకు ప్రారంభ వేతనం ఉంటుందని, ఉద్యోగస్తుడితో పాటు అతడి కుటుంబానికీ రైల్వేలో ఉచిత ప్రయాణం సహా ఇతర సౌకర్యాలు ఉంటాయంటూ నమ్మబలుకుతున్నారు. ఇలా తమ వల్లోపడిన వారి నుంచి రిజిస్ట్రేషన్‌ చార్జీల పేరుతో ప్రాథమికంగా రూ.1000 వసూలు చేస్తున్నారు. 
 ఆపై ప్రాసెసింగ్, యూనిఫాం చార్జీల పేర్లు చెప్పి రూ. 23,100 వరకు వసూలు చేస్తున్నారు. నగదు చెల్లించిన వారు ఎవరైనా ఫోన్లు చేస్తే త్వరలోనే రైల్వే హెడ్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్, నియామక ఉత్తర్వులు అందుతాయంటూ దాట వేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఎవరైనా పదేపదే కాల్స్‌ చేసి ఉద్యోగం విషయం ప్రశ్నిస్తే కొత్త కథ అల్లుతున్నారు. 
⇔ అయితే 95 శాతం మంది రూ. 23,100 కోల్పోయిన తర్వాత వీరికి దూరంగా ఉంటున్నారు. మిగిలిన వారు మాత్రం అదనపు మొత్తం చెల్లించడానికి సిద్ధమంటుంటే... వారి నుంచి మరో రూ.6,900 వరకు వసూలు చేసి వారి నంబర్లను బ్లాక్‌ చేస్తున్నారు.  
 ఈ గ్యాంగ్‌ చేతిలో మోసపోయిన వాళ్లల్లో అత్యధికులు పోలీసుల వరకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. నగరానికి చెందిన ముగ్గురు మాత్రం రూ.23 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లించి మోసపోయారు. వీరంతా సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. 
⇔ వీటిని సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ నేతృత్వంలోని బృందం ప్రధాన నిందితుడు హర్ష కోల్‌కతా సమీపంలోని డమ్‌డమ్‌లో ఉన్నట్లు గుర్తించింది. అక్కడికి వెళ్లే సరికి తన మకాం మార్చేశాడని తేలింది. అయితే అతడు ఓ వ్యక్తితో పదేపదే ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించిన స్పెషల్‌ టీమ్‌ అతడిని పట్టుకుంది. విచారణ నేపథ్యంలో తాను కూడా హర్షకు రూ.30 వేలు చెల్లించి మోసపోయిన కోల్‌కతా వాసినంటూ చెప్పాడు. 
⇔ అతగాడికి నరూ రోయ్‌పర ప్రాంతంలో ఓ కార్యాలయం ఉందని చెప్పి పోలీసులను తీసుకెళ్లి చూపించాడు. దీంతో హర్షను అరెస్టు చేసిన అధికారులు అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు