తప్పులో కాలేసిన టెలీకాలర్‌‌, కట్‌చేస్తే న్యూడ్‌ వీడియో కాల్‌

26 Mar, 2021 07:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

టెలీకాలర్‌ను వేధిస్తున్న నిందితుడిని అరెస్టు చేసిన సైబర్‌ కాప్స్‌

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఓ సంస్థలో టెలీకాలర్‌గా పని చేస్తున్న యువతి చేసిన చిన్న పొరపాటు ఆమెకే శాపంగా మారింది. తన విధులకు సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి వేధింపులు పాలైంది. వేళగాని వేళల్లో ఫోన్లు, సందేశాలతో పాటు న్యూడ్‌ వీడియో కాల్స్‌ చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన నిందితుడిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపిన మేరకు.. ఉత్తర మండల పరిధిలోని సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన యువతి ఓ ప్రైవేట్‌ సంస్థలో టెలీకాలర్‌గా పని చేస్తోంది.

వృత్తిలో భాగంగా నిత్యం అనేక మందితో సంస్థ ఫోన్‌ నుంచి కాల్స్‌ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అయితే టెలీకాలర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ క్లైంట్స్‌కు వ్యక్తిగత ఫోన్‌ నెంబర్లు, వివరాలు అందించకూడదనేది ప్రాథమిక సూత్రం. ఓ సందర్భంలో ఈ యువతి ఛత్రినాక ప్రాంతానికి చెందిన చంద్రవేగ్‌కు ఫోన్‌ చేసి తమ సంస్థ వ్యాపారం విషయం మాట్లాడింది. ఆ సంస్థకు కస్టమర్‌గా మారే విషయాన్ని తాను పరిశీలిస్తానంటూ చెప్పిన చంద్రవేగ్‌ కాస్త సమయం కావాలన్నాడు. సమాధానం చెప్పడం కోసం సంప్రదించడానికంటూ ఆమె వ్యక్తిగత ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడు.

ప్రైవేట్‌ ఉద్యోగి అయిన ఇతగాడు అప్పటి నుంచి ఆమెను రకరకాలుగా వేధించడం మొదలెట్టాడు. అర్ధరాత్రి వేళల్లో ఫోన్లు చేయడం, సందేశాలు పంపడం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో విచక్షణ కోల్పోయిన ఇతగాడు బాధితురాలికి న్యూడ్‌ వీడియో కాల్స్‌ చేయడం మొదలెట్టాడు. విసిగివేశారిన బాధితురాలు ఇటీవల సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు చంద్రవేగ్‌ నిందితుడిగా గుర్తించారు. గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు