అడవిలో జంట ఆత్మహత్య.. ప్రేమికులుగా గుర్తింపు 

17 Oct, 2020 08:45 IST|Sakshi
మృతి చెందిన అంజలి, బాలబాబు(ఫైల్‌ )

రాత్రి వేళ గుర్తించిన అటవీశాఖ అధికారులు  

పెద్దలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య 

సాక్షి, వైఎస్సార్‌ కడప: రాపూరు–చిట్వేలి ఘాట్‌రోడ్డులో రాపూరు నుంచి 6వ కిలోమీటరు వద్ద ఉన్న దట్టమైన అడవిలో పుల్లనీళ్ల చెల్ల (రాళ్ల కాలువ) వద్ద గుర్తు తెలియని యువతి, యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.  గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు వీరి మృతదేహాలను గుర్తించారు. మృతదేహాల వద్ద బ్యాగ్, కొన్ని దుస్తులతోపాటు పురుగు మందు డబ్బా ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

మృతదేహాల స్థితి చూస్తే రెండు.. మూడు రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో వైఎస్సార్‌ జిల్లా రిజిస్ట్రేషన్‌ కలిగిన మోటారు బైక్‌ ఉండడంతో మృతులు వైఎస్సార్‌ జిల్లాకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. మృతుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల లోపు ఉంటుంది. అటవీశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలున్న సమీపంలో కోడేరు వాగు  ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు చూసేందుకు ప్రజల నిత్యం ఈ ప్రాంతానికి వచ్చి జలకాలాటలు ఆడుతుంటారు. ఈ ప్రదేశం పక్కనే మృతదేహాలు పడి ఉండడం కలకలం రేపుతోంది. (ప్రేమ పేరుతో.. పలుమార్లు అత్యాచారం)

ఆ జంట ప్రేమికులుగా గుర్తింపు 
పెనగలూరు: నెల్లూరు జిల్లా రాపూరు అటవీప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడిన యువతీ, యువకుడిని ప్రేమ జంటగా పోలీసులు గుర్తించారు. వివరాలిలా... నారాయణ నెల్లూరు గ్రామానికి చెందిన మొలకల బాలబాబు(21), అదే గ్రామం ఎస్టీ కులానికి చెందిన అంజలి(17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వేరువేరు కులాలు కావడంతో వీరి ప్రేమను ఇరు కుటుంబాలు తిరస్కరించినట్లు తెలిసింది.

కాగా బాలబాబుకు కడప దగ్గరలోని చిన్నమాచుపల్లికు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయం చేశారు. వచ్చే ఆదివారం వివాహం జరగాల్సి ఉంది. పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టం లేకపోవడంతో ఈనెల 11న అంజలీ, బాలబాబు ఇంటి నుంచి వెళ్లిపోయారు. కాగా రాపూరు సరిహద్దు ప్రాంతంలో పోతుగుంట మడుగు వద్ద పురుగుల మందు తాగి మృతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్‌ఐ చెన్నకేశవ కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం పంపారు. 
(అందుకే ఆమెను చంపి నేనూ చనిపోవడానికి సిద్ధపడ్డా!)

మరిన్ని వార్తలు