నమ్రత అక్రమాలపై సమగ్ర దర్యాప్తు 

29 Jul, 2020 12:28 IST|Sakshi
నిందితురాలు పచ్చిపాల నమ్రత , పసికందుల విక్రయాలకు నిలయంగా మారిన యూనివర్సల్‌ సృష్టి ఆస్పత్రి ఇదే 

 కస్టడీకి పోలీసుల ప్రయత్నం

సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణ): ఆస్పత్రి ముసుగులో పసికందులతో వ్యాపారం సాగించిన యూనివర్సల్‌ సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ పచ్చిపాల నమ్రత అక్రమాలపై పోలీసుల సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె ఆరుగురు పసిపిల్లలను విక్రయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మహారాణి పేట సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో సృష్టి ఆసుపత్రిలో తనిఖీలు, రికార్డులు పరిశీలన జరుగుతోంది. కోర్టు నుంచి వచ్చిన సెర్చ్ వారెంట్‌తో పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. తనిఖీలలో పోలీసులుకు సహకరించేందుకు కేజీహెచ్ నుంచి ఇద్దరు వైద్య నిపుణులు వచ్చారు.  వైద్య పరంగా విచారించేందుకు మరో కమిటీ ఏర్పాటు చేయనున్న అధికారులు తెలిపారు. తనిఖీలు అనంతరం ఆసుపత్రి సీజ్ చేసే అవకాశం ఉంది.

ఈ కేసులో ఇంకా లోతుగా విచారణ సాగిస్తున్నమని పోలీసులు తెలిపారు. పసికందుల విక్రయంతో కోట్లాది రూపాయలు సంపాదించిన ఆమె సామ్రాజ్యం చూసి పోలీసులు విస్తుపోయారు. మహారాణిపేట సీఐగా చౌదరి ఉన్నప్పుడే ఆమెపై పీఎం పాలెం, వాంబేకాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. అప్పట్లోనే ఆమెను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించగా పరారైంది. అనంతరం ఇక్కడి నుంచి చౌదరి బదిలీకాగా కొత్త సీఐగా సోమశేఖర్‌ బాధ్యతలు స్వీకరించారు. వెంటనే మళ్లీ ఫిర్యాదు రావడంతో సీఐ సోమశేఖర్‌ సృష్టి మాయలపై దృష్టిసారించారు. ఇంతలో చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు కూడా నిఘా పెట్టడం, మాడుగులలోని ఆశ కార్యకర్త సహకారంతో అసలు భాగోతం వెలుగులోకి వచ్చింది.  

పోలీసుల కళ్లుగప్పి పరార్‌  
పసికందుల విక్రయం వెలుగులోకి రావడంతోనే సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ పచ్చిపాల నమ్రత అప్రమత్తమయింది. విషయం తెలుసుకుని విజయవాడ పరారైంది. దీంతో ప్రత్యేక పోలీసులు బృందం ఎస్‌ఐ రమేష్‌ నేతృత్వంలో అక్కడికి వెళ్లడంతో విషయం తెలుసుకుని హైదరాబాద్‌ మకాం మార్చేసింది. పోలీసులు అక్కడకూ వస్తున్నారని తెలుసు కుని కర్ణాటక రాష్ట్రం దావణగిరిలో గల బంధువుల ఇంటికి పరారైంది. దీంతో పోలీసులు ఆమె సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా సోమవారం దావణగిరిలో అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టులో హాజరుపరిచారు. అక్కడి కోర్టు ద్వారా ట్రాన్సిట్‌ వారెంట్‌ తీసుకుని సోమవారం రాత్రి నగరానికి తీసుకొచ్చి కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి, టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. అనంతరం మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. 

బాధితులు పెరిగే అవకాశం! 
ఆమె నుంచి మరింత సమాచారం సేకరించేందుకుగాను తిరిగి కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు కోర్టులో మెమో ఫైల్‌ చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసులో బాధితులు పెరిగే అవకాశం ఉందని సమాచారం. పసిపిల్లలను పెంచుకునేందుకు చాలా మంది పిల్లలు లేని దంపతులు సృష్టి ఆస్పత్రితో సంప్రదిస్తుండడంతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఒక్క విశాఖపట్నంలోనే కాకుండా తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా చాలా మంది ఆస్పత్రి నిర్వాహకులను సంప్రదించినట్లు సమాచారం. పిల్లాడిని అప్పగిస్తామని చెప్పి ఒకరి నుంచి రూ.14లక్షలు కాజేసినట్లు తెలుస్తుంది. ఇంకా కొంత మంది ఫిర్యాదు చేసేందుకు సంసయిస్తున్నట్లు సమాచారం. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటే నమ్రతను మరింత లోతుగా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అందుకోసం ఆమె కస్టడీ కోసం యతి్నస్తున్నారు. 

సంతాన సాఫల్య కేంద్రాలపై దర్యాప్తు చేపట్టాలి 
ద్వారకానగర్‌ (విశాఖ దక్షిణ): పిల్లల విక్రయ కేంద్రాలుగా మారుతున్న సంతాన సాఫల్య కేంద్రాలపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు  జరిపించాలని ప్రగతిశీల మహిళా సంఘం జనరల్‌ సెక్రటరీ ఎం.లక్ష్మి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్కులో విలేకరులతో ఆమె మాట్లాడారు. సంతాన సాఫల్య కేంద్రాల్లో ఐవీఎఫ్, సరోగసి పేరిట పేద మహిళలను మోసం చేసి పిల్లల విక్రయాలు ఇష్టారాజ్యంగా సాగిస్తున్నారని ఆరోపించారు. సృష్టి ఆస్పత్రిపై 2010 – 13వ సంవత్సరం మధ్య కాలంలో ఫిర్యాదులు వచ్చినప్పుడు విచారణ చేపట్టాలని కోరినా స్పందించలేదన్నారు. ఎంతో మంది పసిపిల్లలను అసాంఘిక కార్యక్రమాలకు, అవయవాల అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అన్ని కేంద్రాలపై విచారణ చేపట్టాలని కోరారు. ఆమెతోపాటు చైతన్య మహిళా సంఘం రాష్ట్ర నాయకులు డి.లలిత, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమైఖ్య, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.  

విక్రయాలపై దర్యాప్తు జరిపించాలి 
అల్లిపురం (విశాఖ దక్షిణ): విశాఖ నగరంలో పసికందుల విక్రయాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ నగర సమితి కార్యదర్శి మరుపల్లి పైడిరాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్, నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌.కె.మీనాలకు లేఖలు రాసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 

మరిన్ని వార్తలు