నేనే రాజు.. నేనే మంత్రి !

16 Sep, 2020 09:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆ ఇన్‌స్పెక్టర్‌ ఓ బిజినెస్‌మెన్‌

ప్రతీ పనికో రేటు, నెలనెలా రూ.లక్షల్లో మామూళ్లు

ఓ కీలక ప్రజాప్రతినిధి సోదరుడి పేరు వాడకం

పోలీస్‌స్టేషనే అడ్డాగా పంచాయతీలు

సర్కిల్‌ పరిధిలోని ఓ గ్రామంలో వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన మైనర్‌ బాలిక ఇంట్లో చెప్పకుండా ఓ అబ్బాయితో వెళ్లింది. బాలిక తల్లిదండ్రులు స్టేషన్‌కు వెళ్లి ఆ అధికారి కాళ్లపై పడి కుమార్తెను అప్పగించాలని ప్రాధేయపడ్డారు. ఇక్కడ కూడా తన తీరు మార్చుకోని ఇన్‌స్పెక్టర్, మీ అమ్మాయిని అప్పగించాలంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.  రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు తమవి, అంత ఇచ్చుకోలేమని బతిమిలాడి రూ.15 వేలు ముట్టచెప్పారు. దీంతో బాలికను వారికి అప్పగించిన ఇన్‌స్పెక్టర్, అబ్బాయి వారి నుంచి రూ.50 వేలు తీసుకుని ఎలాంటి కేసు లేకుండా చేశాడు.   

సాక్షి, వరంగల్‌ / వరంగల్‌ క్రైం : ఆ పోలీస్‌స్టేషన్‌లో ఆయన చెప్పిందే వేదం. అక్కడకు వచ్చే బాధితులు సుంకం కట్టకుండా బయటకు వెళ్లడం సాధ్యం కాదు. కేసు ఏదైనా సరే సుంకం కట్టాల్సిందే. కొత్త నిబంధనలు, ప్రతీ కేసుకో లెక్క, ఆ లెక్కకో రేటు కట్టి మరీ వసూలు చేయడం ఆయన నైజం! ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ‘గబ్బర్‌ సింగ్‌’లా పోలీస్‌ స్టేషన్‌లో పద్ధతులు మార్చేశాడు. సదరు అధికారి విధులు నిర్వర్తించే కాజీపేట సబ్‌ డివిజన్‌లోని ఓ పోలీసుస్టేషన్‌కు బాధితులు వెళ్లి ఫిర్యాదు చేయాలంటేనే జంకుతున్నారు. ఆ ఇన్‌స్పెక్టర్‌ స్టేషన్‌లో బాధ్యతలు తీసుకుని సుమారు 10 నెలలు గడిచింది. అప్పటి నుంచి ఒక్కో పనికి ఒక్కో రేట్‌ చొప్పున ఫిక్స్‌ చేసి నెలనెలా రూ.లక్షలు దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పంట కోత సీజన్‌లో హార్వెస్టర్ల యాజమానుల నుంచి రూ.లక్షల్లో వసూళ్లు చేసిన ఆ ఇన్‌స్పెక్టర్‌ తనకు తానే సాటి అని నిరూపించుకున్నట్లు సొంత శాఖలోనే చర్చ సాగుతోంది.

పోస్టింగ్‌కు ఖర్చు చేశాం కదా!
మామూళ్లకు తెగబడిన ఆ ఇన్‌స్పెక్టర్‌ను ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే చెప్పే సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ‘రూ.లక్షలు ఖర్చు పెట్టుకుని పోస్టింగ్‌ తెచ్చుకున్నాం... ఆ పెట్టుబడి కూడా రాబట్టుకోలేకపోతే ఉద్యోగం ఎందుకు’ అంటూ చెబుతుండడం గమనార్హం. ఆ ఇన్‌స్పెక్టర్‌ వచ్చిన ప్రతీ అవకాశాన్ని డబ్బు రూపంలో మార్చుకోవడం సిద్దహస్తుడిగా చెబుతారు. అవినీతికి కేరాఫ్‌గా నిలిచిన ఆయన వైఖరిపై వరుస ఫిర్యాదులు అందడంతో ఇంటలెజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు ఆరా తీస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

అండ ఉంది..
లాక్‌డౌన్‌ సమయంలో పెద్ద మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్న సదరు ఇన్‌స్పెక్టర్‌ డబ్బు తీసుకుని తక్కువ మొత్తంలో స్టాక్‌ను చూపెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో అప్పటి ఉన్నతాధికారుల నుంచి మందలింపునకు గురైనా ఆయన తీరులో మార్పు రాలేదు. రాష్ట్ర స్థాయిలో పేరు ఉన్న ఓ కీలక ప్రజాప్రతినిధి, మంత్రి పేరు చెప్పుకుంటూ వారి అండదండలు తనకు ఉన్నాయని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం వివాదాస్పదంగా మారింది. ఆ కీలక ప్రజాప్రతినిధి అన్న అండదండలు తనకు ఉన్నాయని, తన పోస్టింగ్‌కు ఎలాంటి ఢోకా లేదని ధీమాతో ఉన్న సదరు ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. 

ఎన్నెన్నో లీలలు

  • ఓ గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఆత్మహత్య కాదని, తల్లీకుమార్తెలు కలిసి హత్య చేశారని గ్రామంలో ప్రచారం జరిగింది. అయితే, పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారడంతో కనీసం ఆత్మహత్య కేసు కూడా నమోదు చేయకుండా దహన సంస్కరాలు చేయించేశారు. ఇక్కడ కూడా ఇన్‌స్పెక్టర్‌ కీలకంగా వ్యవహరించారని సమాచారం.
  • పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటే, ఏం ఏం జరిగిందో తెలియదు కానీ కేసు నమోదు కాలేదు. యువకుడి అంత్యక్రియలు సాధారణంగా జరిగిపోయాయి. 
  • ఊరూరా తిరిగి జాతకాలు చెప్పుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తూ డివైఢర్‌ను ఢీకొని మృతి చెందాడు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాక బండి అప్పగించటానికి రూ.10 వేలు డిమాండ్‌ చేశారు. ఎందుకని ప్రశ్నిస్తే కేసు నమోదు చేస్తేనే ఇన్సూరెన్స్‌ డబ్బు వస్తుంది కాబట్టి, రూ.10వేలు ఇవ్వాల్సిందేనని ఇన్‌స్పెక్టర్‌ సమాధానం చెప్పాడు. 
  •  సర్కిల్‌ పరిధిలో ఓ వ్యక్తి కారుతో మరో వ్యక్తిని ఢీకొట్టడంతో పెద్ద మనుషుల సమక్షంలో చర్చించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి పరిహారంగా రూ. 65 వేలు ఇప్పించగా వివాదం సమసిపోయింది. కానీ విషయం ఇన్‌స్పెక్టర్‌కు తెలియగానే ఎవరూ ఫిర్యాదు చేయకున్నా కారును తీసుకువచ్చి, రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో చేసేదేం రూ.70 వేలు సమర్పించుకుని కారు విడిపించుకున్నారు. 
  • భార్యాభర్తల మధ్య వివాదం పంచాయితీగా మారింది. విడిపోవటానికి భర్త నుంచి భార్యకు నష్టపరిహారంగా రూ. 8.75 లక్షలు చెల్లించాలని కుల పెద్దలు నిర్ణయించారు. ఆ తర్వాత భర్త ఇన్‌స్పెక్టర్‌ను ఆశ్రయించడంతో రూ.50 వేలు తీసుకుని భార్య తరపు వారిని బెదిరించి రూ.3 లక్షలకు పరిహారాన్ని తగ్గించారనే ఆరోపణలు వచ్చాయి.
  • వివాదంలో ఉన్న స్థలం వెంచర్‌గా మారింది. దీనికి గాను స్థలం అమ్ముకున్న వ్యక్తి నుంచి రూ.5 లక్షలు, కొనుక్కున్న వ్యక్తి నుంచి రూ.2 లక్షలు బహుమతి రూపంలో ఇన్‌స్పెక్టర్‌ తీసుకున్నట్లు సర్కిల్‌ పరిధిలో చర్చ జరిగింది.
  • గుట్కాల వ్యాపారాన్ని చూసీచూడనట్లు ఉండటానికి వ్యాపారులు నెలనెలా రూ.2.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో తీసుకొచ్చే గుట్కాలు ఇక్కడి నుంచే జిల్లా కేంద్రానికి సరఫరా అవుతుండడం గమనార్హం. 
  • మండలం, సర్కిల్‌ పరిధిలో ఉన్న రెండు, మూడు వాగుల నుంచి నిత్యం సుమారు 70 ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ నుంచి నెలకు రూ.10 వేలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా