స్మార్ట్‌ కిల్లర్స్‌.. రక్తం చుక్క బయట పడకుండా..

20 Jun, 2021 10:33 IST|Sakshi
కంచికచర్లలో హత్యకు గురైన వృద్ధ దంపతులు (ఫైల్‌)

సాక్షి, అమరావతి బ్యూరో/పెనమలూరు: సులభంగా డబ్బు సంపాదించాలని భావించి నేర బాట పట్టిన హంతక ముఠా అరాచకాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని పోరంకి, తాడిగడపకు చెందిన ఐదుగురు యువకులు జులాయిగా తిరుగుతూ.. ఖర్చుల కోసం ఒంటరి మహిళలను హత మార్చినట్లు విచారణలో తేలింది. నిందితుల పేర్కొన్నట్లుగా పోలీసులు ఘటనా స్థలాలకు వెళ్లి సీన్‌ రీకన్సస్ట్రక్షన్‌ చేయగా విస్తుబోయే విషయాలు బయటపడ్డాయి.

రక్తం చుక్క బయట పడకుండా.. ఇంట్లో ఉన్న వస్తువులు చెల్లాచెదరకుండా.. మంచంపై నిద్రిస్తున్న మహిళలు మంచంపైనే విగతజీవులు పడి ఉండే విధంగా దిండుతో నొక్కి చంపేసి సహజ మరణంలా సృష్టించడంలో ముఠా ఆరితేరింది. వరుస హత్యలు చేసుకుంటూ వెళ్లినా కుటుంబ సభ్యులకు సైతం అనుమానం రాకపోవడం విశేషం. చివరకు ఏటీఎం చోరీ కేసులో ముఠా ఆగడాలు బట్టబయలయ్యాయి. ఆ వివరాలు ఇలా..

గ్యాంగ్‌ సభ్యులు ఐదుగురు..   
పోరంకి చెందిన ఇద్దరు, తాడిగడపకు చెందిన మరో ముగ్గురు యువకులు కలిసి జులాయి తిరిగే వారు. వీరిలో ఒకడు నగరంలో ఇంటింటికీ తిరిగి పాల ప్యాకెట్లు వేసేవాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ వీరు ముందుగా చైన్‌ స్నాచింగ్, తాళం వేసిన ఇళ్లను కొల్లగొట్టడం వంటి నేరాలకు పాల్పడ్డారు. అలాగే కృష్ణా జిల్లాతోపాటు పలు జిల్లాల్లో ఏటీఎంల్లో డబ్బు దొంగలించాలని యత్నించారు. ఫలితం లేకపోవడంతో పాల ప్యాకెట్లు వేసేవాడు ఇచ్చిన సలహాతో పోరంకిలోని ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలిని గతేడాది చంపేసి ఆమె వద్ద ఉన్న నగలు దోచుకెళ్లారు.  తర్వాత గ్యాంగ్‌లోని ఒక సభ్యుడు తల్లిదండ్రుల షాపు చూసుకోవడానికి కంచికచెర్ల వెళ్లాడు.

కొన్నాళ్లకు షాపు అమ్మేసి తిరిగి నగరానికి చేరుకున్నాడు. మళ్లీ గ్యాంగ్‌తో కలిసి కంచికచర్లలో తాను ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులను చూశానని చెప్పాడు. దీంతో ముఠా సభ్యులు కంచికచెర్లకు చేరుకుని రెక్కీ నిర్వహించి ఆ ఇద్దరిని తమ పద్ధతిలో హతమార్చి పరారయ్యారు. తర్వాత అదే ఏడాది చివరి నెలలో తాడిగడప కట్ట వద్ద ఓ వృద్ధురాలిని, పోరంకి పాత పోస్టాఫీసు సమీపంలో మరో వృద్ధురాలిని సైతం చంపేసి నగలతో ఉడా యించారు. తాజాగా తెనాలి, మంగళగిరి, అవనిగడ్డ ప్రాంతాల్లో మరో ముగ్గుర్ని చంపాలని నిర్ణయిచినట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించినట్లు సమాచారం.  

చంపేసి.. నిర్ధారించుకుంటారు..  
ముఠా సభ్యులు ఘటనా స్థలానికి మళ్లీ మర్నాడు వెళ్లేవారని తెలుస్తోంది. పోలీసులు వచ్చారా? కేసు ఏమైనా నమోదు చేశారా? తాము చంపిన వాళ్లు చనిపోయారా? అని నిర్ధారించుకునేవారని సమాచారం.
చదవండి: భగ్గుమన్న పాత కక్షలు, ఇద్దరి దారుణ హత్య

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు