ప్రేమజంటపై దాడి కేసులో పురోగతి

25 Sep, 2022 11:16 IST|Sakshi

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌/ఆత్మకూరు: ప్రేమజంటపై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆత్మకూరు మండలం పంపనూరు సిటీ పార్క్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ప్రేమికులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప సీరియస్‌గా పరిగణించారు. దీనిని సవాలుగా తీసుకుని ఛేదించాలని దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులును ఆదేశించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పంపనూరు సమీపంలోని వడ్డుపల్లి మిట్ట వద్ద ప్రేమికులపై దాడి చేసిన ముఠా ఆనవాళ్లను 24 గంటల్లోపే పసిగట్టారు. ప్రాథమికంగా సేకరించిన   ఆధారాల మేరకు అనంతపురం నగరానికి చెందిన అల్లరి మూకలే దాడులకు కారణంగా గుర్తించారు.  అనంతరం వారు అపహరించిన సెల్‌ఫోన్‌ నంబర్‌ ఆధారంగా నిందితులను గుర్తించారు.

ఈ క్రమంలోనే నగరంలోని రాజీవ్‌ కాలనీ, హెచ్చెల్సీ కాలనీకి చెందిన ఇద్దరితో పాటు కంబదూరుకు చెందిన ఓ యువకుడిని శనివారం  పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. 

ఏకాంతం మాటున ప్రమాదం
ప్రేమ జంటలకు పంపనూరు సమీపంలోని సిటీ పార్క్‌ కేంద్రంగా మారింది. ఏకాంతం కోసం సిటీ పార్క్‌లోని పొదలను ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నెల 23న సిటీ పార్క్‌ సందర్శనకు వచ్చిన ఓ ప్రేమజంటపై గుర్తు తెలియని యువకులు దాడిచేసి మూడు సెల్‌ఫోన్లు, రెండు తులాల బంగారు నగలు అపహరించుకెళ్లిన విషయం విదితమే. ఇది మొదటి సారి ఏమీ కాదు!  గతంలో ఎన్నో సార్లు ప్రేమజంటలను టార్గెట్‌ చేసి నగదు, విలువైన వస్తువులు అపహరించుకెళ్లారు.  

సిటీ పార్క్‌లో విహరిస్తూ 
ఎక్కువగా కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు జంటగా సిటీ పార్క్‌కు వస్తున్నారు. వీరిలో కొందరు మైనర్లు ఉండడం గమనార్హం. కాలేజీకి డుమ్మా కొట్టి పుస్తకాల బ్యాగు పక్కన పడేసి సిటీ పార్క్‌లో చక్కర్లు కొడుతూ ఏకాంతం కోసం గుట్టల్లోని పొదల మాటుకు వెళుతున్నారు. ఇదే అవకాశంగా కొందరు యువకులు వారిని బెదిరించి లూటీ చేస్తున్నారు.   

చైతన్యం రావాలి  
ప్రేమజంటపై దాడి చేసిన వారిని పట్టుకు తీరుతాం. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టి సారించాం. సిటీ పార్క్‌ ప్రాంతంలో పోలీసుల పహారా పెంచుతున్నాం. కాకపోతే ప్రజల్లో చైతన్యం రావాలి. ఘటన జరిగిన వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేసి విషయాన్ని పోలీసులకు చేరవేయాలి. ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి.  
– ఆర్ల శ్రీనివాసులు, దిశ డీఎస్పీ  

యువత జాగ్రత్తగా ఉండాలి 
పంపనూరు సిటీ పార్కుకు ఎక్కువగా యువత వస్తుంటారు. కనుచూపు మేర అటవీ ప్రాంతం ఉండడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. యూనిఫాంతో జంటగా వచ్చే విద్యార్థులను, మైనర్లను అటవీ ప్రాంతంలోకి అనుమతించకుండా చర్యలు తీసుకుంటాం.  
– ఎస్‌ఐ శ్రీనివాసులు, ఆత్మకూరు   

(చదవండి: శాస్త్రీయ పద్ధతులతో సమగర​ దర్యాప్తు)

మరిన్ని వార్తలు