మసాజ్‌ కోసం పిలిచి వివస్త్రను చేసి.. కళ్లల్లో, నోట్లో హిట్‌ కొట్టి...

17 May, 2022 06:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: వివస్త్రను చేసి.. కళ్లల్లో, నోట్లో హిట్‌ కొట్టి... మసాజ్‌ థెరపిస్టును హింసించిన వ్యవహారంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితురాలి నుంచి డయల్‌– 100 ద్వారా ఫిర్యాదు అందుకుని వచ్చిన పెట్రోలింగ్‌ పోలీసులు ఆ అయిదుగురు విటుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారు. నాలుగు రోజులు పూర్తయినా ఈ విషయంపై విచారణ, బాధ్యులపై చర్యల విషయంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బాధితురాలితో పైశాచికంగా ప్రవర్తించిన ఆమె స్నేహితురాళ్లు ముగ్గురినీ ఆదివారం పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో చాప కింద నీరులా ఇలాంటి వ్యవహారాలు సాగిస్తున్న ముఠాలు మరికొన్ని ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి.  

‘పరిష్కరించడ’మంటే ఏంటో? 
కోల్‌కతాకు చెందిన బాధితురాలు (26) తన స్నేహితురాలు సంజన సూచనలతో బంజారాహిల్స్‌ రోడ్‌  నం.11లోని స్పా సెంటర్‌లో థెరపిస్ట్‌గా పని చేయడానికి ఈ నెల 9న వచ్చింది. మసాజ్‌ ముసుగులో ఆమెతో వ్యభిచారం చేయించడానికి సంజనతో పాటు కోమతి, సునీత ఒప్పించారు. గురువారం మధ్యాహ్నం బాధితురాలిని క్యాబ్‌లో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 25లోని ఫ్లాట్‌కు సంజన పంపింది. అప్పటికే అక్కడ కోమతి, సునీతలతో పాటు అయిదుగురు యువకులు ఉన్నారు. అక్కడ ఉన్న కస్టమర్లతో మెసలుకోనే విషయంలో తలెత్తిన వివాదం బాధితురాలిపై దాడి చేసే వరకు వెళ్లింది. దీంతో ఆమె 100కు ఫోన్‌ చేయగా... ఆ ఫ్లాట్‌ వద్దకు వెళ్లిన పెట్రోలింగ్‌ అధికారులు విషయం ‘పరిష్కరించారు’. ఈ పరిష్కారమే బాధితురాలిపై హత్యాయత్నం వరకు వెళ్లింది. 

నిందితుల్ని ఎలా వదిలిపెడతారు? 
ఈ ఉదంతంలో బాధితురాలితో పాటు కోమతి, సునీత తదితరులతో వ్యభిచారం జరుగుతున్నట్లు స్పష్టమైంది. ఈ విషయం అక్కడకు వెళ్లిన పోలీసులకు అర్థం కాకపోవడం గమనార్హం. అలాంటి కేసులను పోలీసులు ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇమ్మోరల్‌ ట్రాఫికింగ్‌ యాక్ట్‌ (పీటా) కింద నమోదు చేస్తారు. దీని ప్రకారం ఆ ఫ్లాట్‌లో ఉన్న యువతులను బాధితులుగా, యువకులను విటులుగా పరిగణించాలి. బాధితురాళ్లను రెస్యూ హోమ్‌ తరలించి విటులను అరెస్టు చేయడం లేదా సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇదేమీ జరగకుండా కేవలం విషయం ‘పరిష్కారమైంది’. అధికారుల ఈ నిర్లక్ష్యం కారణంగానే బాధితురాలు కొన్ని గంటల పాటు చిత్రహింసలు అనుభవించాల్సి రావడంతో పాటు నగ్నంగా అపార్ట్‌మెంట్‌ బయట పరుగుపెట్టాల్సి వచ్చింది. 

చర్యలకు ఎందుకో వెనుకడుగు? 
ఈ వ్యవహారంలో డయల్‌–100 ద్వారా సమాచారం అందుకుని, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 25లోని ఫ్లాట్‌ వద్దకు వెళ్లిన పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రోజు అక్కడ ఉన్న ఐదుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా సమాచారం. దీనిపై ఇప్పటి వరకు పోలీసుల నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బాధితురాలితో అమానుషంగా ప్రవర్తించి, నిర్బంధించి, హత్యాయత్నం చేసిన సంజన, కోమతి, సునీతలపై కేసు నమోదు చేసి శనివారం అరెస్టు చేశారు. బాధితురాలికి తెలియకపోయినా.. వీరిని విచారిస్తే ఆ అయిదుగురు ఎవరన్నది తెలిసే అవకాశం ఉంది. అలా ఈ వ్యవహారం మొత్తానికి కారణమైన విటులపై చర్యలు తీసుకోవచ్చు. దీంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులకూ విషయం ‘బోధపడేలా’ చెప్పాల్సి ఉంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు.   

చదవండి: ప్లాటు బదులు పైసలివ్వు.. లేదంటే చావు

మరిన్ని వార్తలు