కౌన్సిలర్‌ హంతకుల కోసం గాలింపు

11 Aug, 2021 04:23 IST|Sakshi
బైక్‌పై వేచివున్న అనుమానితుడిగా ఉన్న వ్యక్తి సీసీ కెమెరాలు ఫుటేజీ

10 బృందాలుగా ఏర్పడిన పోలీస్‌ అధికారులు

టీడీపీ నాయకులకు అనుమానితుడి ఫోన్‌

సూళ్లూరుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిల్‌ సభ్యుడు తాళ్లూరు వెంకట సురేష్‌ (40)ను దారుణంగా హత్య చేసిన దుండగులను పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ విజయారావు ఆదేశాల మేరకు ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్‌ఐల ఆధ్వర్యంలో పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టామని గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. మృతుడు సురేష్‌ ఉన్న ఇంటి కింద మరో ఇంటిలో తడ మండలం వాటంబేడుకుప్పానికి చెందిన బాలు అనే వ్యక్తి గడచిన మూడేళ్లుగా ఉండేవాడని, అతను సురేష్‌ కుటుంబసభ్యులతో సన్నిహితంగా మెలిగేవాడని తెలిసిందన్నారు.

హత్య జరిగిన తరువాత అతను గదిలో లేకపోవడం, సెల్‌ స్విచ్చాఫ్‌ చేయడంతో అతన్ని అనుమానితుడిగా గుర్తించామని తెలిపారు.  హత్య జరిగిన వెంటనే మృతుడు నివాసం ఉన్న బ్రాహ్మణవీధి సెంటర్లో అరుణ్‌ ఐస్‌క్రీం వద్ద సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించామని, బాలు అనే వ్యక్తి మోటార్‌ సైకిల్‌పై అక్కడ అనుమానాస్పదంగా వేచి ఉండడం గుర్తించామని తెలిపారు. బాలు ఫోన్‌ను ట్యాపింగ్‌ చేయగా.. సుమారు ఐదారుగురు టీడీపీ నాయకులకు ఫోన్‌కాల్స్‌ వెళ్లినట్లు గుర్తించామని తెలియజేశారు. వారిని పిలిపించి విచారిస్తామని డీఎస్పీ తెలిపారు. కాగా మంగళవారం సాయంత్రం తాళ్లూరు వెంకట సురేష్‌ అంత్యక్రియలు నిర్వహించారు.  

మరిన్ని వార్తలు