సుశీల్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు

9 May, 2021 04:21 IST|Sakshi
సత్పాల్‌ సింగ్, సుశీల్‌ కుమార్‌ (ఫైల్‌)

యువ రెజ్లర్‌ మృతి కేసులో సుశీల్‌ మామ సత్పాల్‌ను విచారించిన పోలీసులు

న్యూఢిల్లీ: యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా మృతి వ్యవహారంపై పోలీసుల విచారణ కీలక మలుపు తీసుకుంది. గ్రీకో రోమన్‌ 97 కేజీల విభాగంలో జాతీయ జూనియర్‌ మాజీ చాంపియన్‌ అయిన 23 ఏళ్ల సాగర్‌ రాణాను కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టడంతో అతను చనిపోయాడు. భారత రెజ్లర్లకు అడ్డాలాంటి ఛత్రశాల్‌ స్టేడియం బయట జరిగిన ఈ ఘటనలో రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత, భారత మేటి రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ హస్తం ఉందని వినిపిస్తోంది. అయితే అతను ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు.

ఈ నేపథ్యంలో సుశీల్‌ మామ, సీనియర్‌ కోచ్‌ సత్పాల్‌ సింగ్‌ను పోలీసులు విచారించారు. ‘సుశీల్‌ మామ సత్పాల్‌ సింగ్, అతని బావమరిదిలను సుమారు రెండు గంటల పాటు విచారించాం. మంగళవారం స్టేడియం పార్కింగ్‌ ఏరియా వద్ద జరిగిన గొడవలో సుశీల్, అజయ్, ప్రిన్స్‌ దలాల్, సోనూ మహల్, సాగర్‌ అమిత్‌ భాగంగా ఉన్నారని మా విచారణలో తేలింది. సుశీల్, అతని సహచరులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నాం’ అని అడిషనల్‌ డీసీపీ గురిక్బాల్‌ సింగ్‌ వెల్లడించారు. మరోవైపు అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జితేంద్ర సింగ్‌ రాసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలో ‘సుశీల్‌ పహిల్వాన్, అతని సహచరులు ఈ నేరం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది’ అని రాసి ఉంది.


1982 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సత్పాల్‌ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలు కూడా లభించాయి. కెరీర్‌ తొలినాళ్ల నుంచి సత్పాల్‌ సింగ్‌ వద్ద శిక్షణ తీసుకున్న సుశీల్‌ 2010లో సత్పాల్‌ సింగ్‌ కూతురు సావీని పెళ్లి చేసుకున్నాడు.
 

మరిన్ని వార్తలు