Bus Accident: 300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ప్రాణాలను పణంగా పెట్టి..

27 Mar, 2022 07:41 IST|Sakshi

300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ఎవరు ప్రాణాలతో ఉన్నారో తెలియదు, ఎవరు చనిపోయారో తెలియదు.. ఘటనా స్థలికి చేరుకోవడం ప్రాణాలతో చెలగాటం. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో టూరిస్టు బస్సు భాకరపేట మొదటి ఘాట్‌ లోయలో పడిపోయిందనే సమాచారం అందగానే జిల్లా కలెక్టర్‌ హరినారాయణతో పాటు పోలీసు శాఖ అప్రమత్తమైంది. అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌జెట్టి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు హర్షిత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. వీరితో పాటు స్థానికులు ప్రాణాలను ఫణంగా పెట్టి లోయలోకి దిగి క్షతగాత్రులకు సహాయక చర్యలు చేపట్టారు.

సాక్షి బృందం, తిరుపతి: అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మారుతి నగర్‌కు చెందిన మలిశెట్టి మురళి కుమారుడు మలిశెట్టి వేణు(25) నిశ్చితార్థం నారాయణవనం మండలం తుంబూరుకు  చెందిన అమ్మాయితో నిశ్చయించారు. ఆదివారం ఈ వేడుకను తిరుచానూరులోని రాధాకృష్ణ కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. అందులో భాగంగా శనివారం ఉద యం 11 గంటలకు టూరిస్టు బస్సులో ధర్మవరం, చుట్టుపక్క ప్రాంతాల నుంచి సుమారు 55 మంది బయలుదేరారు. అతి వేగంతో పాటు ఫిట్‌నెస్‌ లేని బస్సు కావడంతో భాకరపేట సమీపంలోని ఘాట్‌లో 300 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది.

చదవండి: చిత్తూరులో విషాదం.. లోయలో పడ్డ బస్సు

రక్తసిక్తం..
బస్సు లోయలోకి పడిపోవడంతో ఆ ప్రాంతంలో హాహాకారాలు మిన్నంటాయి. క్షతగాత్రులు రక్షించండి, కాపాడండి అంటూ పెద్ద ఎత్తున రోదించారు. చెల్లాచెదురుగా పడిన మృతులు, క్షతగాత్రులతో ఆ ప్రాంతం బీతావహంగా మారిపోయింది. స్థానికులతో పాటు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేందుకు ప్రాణాలను ఫణంగా పెట్టారు. తాళ్లు, చెట్ల సాయంతో ఘటనా స్థలికి చేరుకున్నారు.

ఒకరికొకరు తోడుగా.. 
క్షతగాత్రులను కాపాడేందుకు ఒకరికొకరు తోడుగా లోయలోకి చేరుకున్నారు. ఒక్కో క్షతగాత్రుడిని బయటకు తీసుకొచ్చేందుకు ఆరుగురు చొప్పున అరగంట పాటు శ్రమించాల్సి వచ్చింది. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, సీవీఎస్‌ఓ గోపినాథ్‌జెట్టి స్వయంగా క్షతగాత్రులకు ప్రాథమక చికిత్సలు చేశారు. కలెక్టర్‌ హరినారాయణన్‌ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. పది 108 వాహనాలు 12కు పైగా ట్రిప్పులు, ఒక ప్రయివేట్‌ వెహికల్, నాలుగు మినీ వ్యాన్లతో క్షతగాత్రులను రుయాకు తరలించారు. 

పెళ్లి కొడుక్కి తీవ్ర గాయాలు 
ప్రమాదంలో పెళ్లి కుమారుడు వేణుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతని పిన్నమ్మ ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచింది. మరో ఆరుగురు మరణించగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో మొత్తం 55 మంది ఉండగా, 48 మంది రుయాలోని అత్యవసర విభాగం, ఎంఎం వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రుల్లో 11 మందికి పైగా చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రిలో పరిస్థితిని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి, ఏఎస్పీ సుప్రజ, డీఎస్పీ మురళీకృష్ణ, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి, తిరుపతి రూరల్‌ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, అర్బన్‌ తహసీల్దార్‌ వెంకటరమణ తదితరులు వైద్య సేవలను దగ్గరుండి పర్యవేక్షించారు.  

మరిన్ని వార్తలు