పాదరసం.. అంతా మోసం 

10 Oct, 2020 10:40 IST|Sakshi
పాత చెక్క టీవీ , (అంతరచిత్రం) పాదరసం

పాత టీవీల్లో రెడ్‌ మెర్క్యూరీ ఇస్తే లక్షలిస్తాం

గిరిజన గ్రామాల్లో మోసగాళ్ల ప్రచారం 

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

బుట్టాయగూడెం(పశ్చిమగోదావరి): మీ దగ్గర పాతకాలం నాటి చెక్కటీవీలున్నాయా! వాటిలో రెడ్‌ మెర్క్యూరీ(ఎర్ర పాదరసం) ఇస్తే లక్షలిస్తాం.. అంటూ కొందరు మోసగాళ్లు ఏజెన్సీ గ్రామాల్లో సంచరిస్తున్నారు. వీరి వలలో పడిన యువత అది నిజమేనని నమ్మి మోసపోతున్నారు. నిజానికి రెడ్‌ మెర్క్యూరీ అనే లోహమేది లేదు. అదంతా కొందరి మాయగాళ్ల ప్రచారమని తెలియక నడమంత్రపు సిరి వస్తుందని జిల్లా ఏజెన్సీలోని కొందరు ఆ మాయలో చిక్కుకుంటున్నారు. రెడ్‌ మెర్క్యూరీ కోసం వేట కొనసాగిస్తూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకుంటున్నారు.

నిజానికి టీవీ, రేడియోల్లో పాదరసం ఉంటుంది. వాటిలో ఎరుపు పాదరసం కూడా ఉంటుందని, దానికి బ్లాక్‌ మార్కెట్‌లో మంచి ధర ఉంటుందని నమ్మబలుకుతున్నారు. దీని కొనుగోలు కోసమన్నట్లు కొంతమంది వ్యక్తులు గిరిజన గ్రామాల్లో సంచరిస్తున్నారు. ఇదంతా నిజంకాదని.. అలాంటి వ్యక్తుల మాయలో పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గతంలో రైస్‌ పుల్లింగ్‌ పేరిట ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో కొందరు పర్యటించి మోసాలకు పాల్పడేవారు. ప్రస్తుతం అదే తరహాలో పాత టీవీలు, రేడియోల కోసమంటూ తిరుగుతూ యువతను బుట్టలో వేసుకుంటున్నారు. అలాగే నాగస్వరం ఆనపకాయలు, గుమ్మడి కాయల కోసం కూడా బృందాలు తిరుగుతున్నట్లు సమాచారం.

నాగస్వరం ఆనపకాయ   

అన్నీ పుకార్లే 
గతంలో రైస్‌ పుల్లింగ్‌ పేరిట మోసాలు జరిగాయి. ప్రస్తుతం అదే తరహాలో రెడ్‌ మెర్క్యూరీ పేరిట సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కొందరు వ్యక్తులు గిరిజన ప్రాంతంలో పాత టీవీలు, రేడియోల కోసం పర్యటిస్తున్నట్లు సమాచారం ఉంది. ప్రజల బలహీనతను సొమ్ముచేసుకునే ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దు.  
– ఎం.వెంకటేశ్వరరావు, డీఎస్పీ, పోలవరం    

మరిన్ని వార్తలు