24 గంటలు ఆగాలంటూ..

28 May, 2022 07:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరాల్లో నగదు కోల్పోయిన వారు 24 గంటల్లోపు ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు.. ఇలాంటి కేసుల్లో తక్షణం స్పందిస్తూ వాలెట్స్‌లో ఉన్న నగదు వెనక్కు వచ్చేలా చేస్తున్నారు. దీంతో తెలివి మీరిన సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తు వేస్తున్నారు. 24 గంటలు ఆగండి మీ డబ్బు తిరిగి వచ్చేందస్తుందని చెప్పడం. గ్యాస్‌ బుక్‌ చేయడానికి ప్రయత్నించి రూ.1.58 లక్షలు పోగొట్టుకున్న అత్తాపూర్‌ యువతి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

ఇదీ జరిగిన వ్యవహారం... 
అత్తాపూర్‌ ప్రాంతానికి చెందిన యువతి మంగళవారం గ్యాస్‌ బుక్‌ చేయడానికి ప్రయత్నించారు. అందుకు అవసరమైన నంబర్‌ కోసం గూగుల్‌లో వెతగ్గా ఓ సైబర్‌ నేరగాడు పొందుపరిచిన నంబర్‌ కనిపించింది. దానికి కాల్‌ చేసిన యువతి నుంచి కొన్ని వివరాలు తెలుసుకున్న సైబర్‌ నేరగాడు క్యూఆర్‌ కోడ్స్‌ పంపాడు. ఇలా నాలుగు లావాదేవీల్లో రూ.1,58,736 కాజేశారు. తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బు పోయిన విషయం గమనించిన యువతి సదరు సైబర్‌ నేరగాడికి ఫోన్‌ చేసి ప్రశ్నించింది. సాంకేతిక పొరపాటు వల్ల జరిగిందని చెప్పిన అతడు 24 గంటలు ఆగితే నగదు తిరిగి ఖాతాలోకి వచ్చేస్తుందని చెప్పాడు. దీంతో బుధవారం వరకు వేచి చూసిన ఆమె గురువారం సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  

ఎందుకు ఇలా చెప్తారంటే... 
యువతి నుంచి కాజేసిన డబ్బు తొలుత సైబర్‌ నేరగాడికి సంబంధించిన వాలెట్‌లోకి చేరుతుంది. ఆ నగదు అక్కడే ఉండగా విషయం పోలీసుల వరకు వెళితే అధికారులు వాలెట్‌ నిర్వాహకుడి సంప్రదించడం ద్వారా ఫ్రీజ్‌ చేయడానికి, తిరిగి బాధితురాలి ఖాతాలోకి పంపడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఫిర్యాదు చేయడం 24 గంటలు ఆలస్యమైతే సైబర్‌ నేరగాడి పని తేలికవుతుంది. వాలెట్‌లో ఉన్న నగదు బోగస్‌ వివరాలతో తెరిచిన బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించడానికి, డ్రా చేసుకోవడానికీ నేరగాడికి సమయం చిక్కుతుంది.

పోలీసుల దర్యాప్తులో నేరగాడు చిక్కినా నగదు రికవరీ మాత్రం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో తాజాగా సైబర్‌ నేరగాళ్లు 24 గంటలు ఆగండి అంటూ కొత్త పంథా అనుసరిస్తున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా ఇలాంటి నేరాల్లో బాధితులుగా మారిన వెంటనే స్పందించి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. గూగుల్‌లో కనిపించే నంబర్లనూ నమ్మవద్దని స్పష్టం చేస్తున్నారు. 

(చదవండి: నడిరోడ్డుపై దారుణం...వివాహిత పై యువకుడి దాడి)

మరిన్ని వార్తలు