రేషన్‌ డీలర్‌ కోసం గాలింపు 

20 May, 2022 04:45 IST|Sakshi
చంద్రబాబుతో అరుణ్‌బాబు

కుటుంబ సభ్యులతో కలిసి పరార్‌? 

టీడీపీ నేతలతో సత్సంబంధాలు 

రేషన్‌ పంపిణీలో అక్రమాలు వెలుగుచూడడంతోనే డీటీపై దాడి 

పెనమలూరు: విధి నిర్వహణలో ఉన్న డిప్యూటీ తహసీల్దార్‌ (డీటీ) గుమ్మడి విజయ్‌కుమార్‌పై ఈనెల 17న దాడికి కారకుడైన రేషన్‌ డీలర్‌ లుక్కా అరుణ్‌బాబు కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత డీలర్‌ తన కుటుంబ సభ్యులతో పారిపోయిన విషయం తెలిసిందే.

ఘటన జరిగిన తర్వాత అరుణ్‌బాబు గురించి ఆరా తీస్తే అతను పక్కా టీడీపీ వ్యక్తిగా స్పష్టమైంది. అంతేకాక.. స్థానికంగా టీడీపీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పేదలకు రేషన్‌ పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ అరుణ్‌బాబు పచ్చచొక్కా వేసుకుని రేషన్‌ అక్రమాలకు తెరలేపాడు. ఇతనికి టీడీపీ అగ్రనేతలతో కూడా సత్సంధాలున్నాయని చెబుతున్నారు.  

టీడీపీ హయాంలోనే నియామకం 
నిజానికి.. లుక్కా అరుణ్‌బాబును టీడీపీ హయాంలో నిబంధనలు అతిక్రమించి మరీ కృష్ణాజిల్లా పెనమలూరు డీలర్‌గా నియమించారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు నాటి టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో ఫొటోలు కూడా దిగాడు. పార్టీ జెండాను భుజంపై వేసుకుని టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని తెలిసింది.

ఈ నేపథ్యంలో.. పార్టీ అండ చూసుకుని రేషన్‌ను పక్కదారి పట్టిస్తున్నాడు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్‌ గుమ్మడి విజయ్‌కుమార్‌ తనిఖీ చేయగా 330 కిలోల బియ్యం, 152 ప్యాకెట్ల పంచదార మాయం చేశాడని తేలింది. డీలర్‌ లుక్కా అరుణ్‌బాబు గుట్టురట్టు కావడంతో అతనిని కాపాడేందుకు బోడె ప్రసాద్, అతని అనుచరులు అధికారులపై దాడిచేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అదృశ్యమైన డీలర్‌ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.  

దాడిలో 9 మందికి రిమాండ్‌ 
ఇక డిప్యూటీ తహసీల్దార్‌పై దాడి కేసులో తొమ్మిది మందికి కోర్టు రిమాండ్‌ విధించింది. నిందితులు వంగూరు పవన్, చిగురుపాటి శ్రీనివాసరావు, దొంతగాని పుల్లేశ్వరరావు, కొల్లిపర ప్రమోద్, కిలారు ప్రవీణ్, బోడె మనోజ్, కాపరౌతు వాసు, కిలారు కిరణ్‌కుమార్, వెలివెల సతీష్‌లను పెనమలూరు పోలీసులు అరెస్టుచేసి నిందితులను గురువారం విజయవాడ రైల్వే కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. 

మరిన్ని వార్తలు