-

‘మాయలేడి’ మామూలుది కాదు.. ఎన్ని కేసులో

26 May, 2021 09:58 IST|Sakshi

 గాలింపులో ప్రత్యేక బృందాలు

వైట్‌ కాలర్‌ నేరాల్లో ఆరితేరిన నిందితురాలు

హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు సమాచారం

చట్ట ప్రకారం చర్యలు తప్పవన్న విజయవాడ సీపీ శ్రీనివాసులు  

సాక్షి, అమరావతి బ్యూరో: అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి అనేక రకాలుగా మోసగించి రూ. లక్షలు కాజేసి పరారీలో ఉన్న మాయలేడి కోసం నగర పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలోని మైలవరం, విజయవాడ నగరంలోని పలువురు ఈ మాయలేడి బారిన పడి రూ.లక్షలు నష్టపోయిన వైనంపై మంగళవారం సాక్షి దినపత్రికలో ‘మాయలేడితో ఖాకీల మిలాఖత్‌!’ అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. ఈ వార్తపై తక్షణం స్పందించిన నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు సత్వర చర్యలు చేపట్టారు. చట్టపరంగా నిందితురాలికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పరారీలో ఉన్న మాయలేడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  

మాయలేడిపై ఉన్న కేసుల వివరాలు.. 
∙విజయవాడలోని మధురానగర్‌కు చెందిన ఒక మహిళ, ఆమె కుమార్తె, కుమారుడిపై విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌లోని పలు పోలీస్‌స్టేషన్లతో పాటు జిల్లాలోని మైలవరం పోలీసుస్టేషన్‌లో పలు చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. మైలవరం పట్టణానికి చెందిన ఓ మహిళ వద్ద నుంచి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం పేరిట రూ. 28 లక్షలు మాయమాటలు చెప్పి కాజేసింది. ఈ విషయంలో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసుస్టేషన్‌లో 2019లో 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో అండర్‌ ట్రైల్‌ నడుస్తోంది. ∙2017 మే నెలలో కూడా బాధితురాలిని కొట్టి, బెదిరించిన కేసులోనూ మాయలేడిని సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసూ కోర్టు అండర్‌ ట్రైల్‌లో ఉంది.  

పెనమలూరుకు చెందిన ఓ నిరుద్యోగికి హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ. 24 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన వ్యవహారంలోనూ 2020 డిసెంబరులో పెనమలూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న మాయలేడిని జనవరి 11న హైదరాబాద్‌లో మెహదీపట్నం ఫ్లై ఓవర్‌ సమీపంలో పెనమలూరు పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసులో పోలీసుల రిమాండ్‌ రిపోర్ట్‌ను విజయవాడ ఆరో అదనపు ఎంఎం కోర్టు జడ్జి రిటర్న్‌ చేయడంతో ఆమె స్టేషన్‌బెయిల్‌పై విడుదలైంది. తర్వాత తనతో కలిసి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసిన కానూరుకు చెందిన ఒక మహిళను సైతం పైవిధంగానే మోసం చేసింది. బాధితురాలి కుమారుడు, కుమార్తెకు హైకోర్టు, నీటిపారుదుల శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి నకిలీ అపాయింట్‌మెంట్‌ ఇచ్చి రూ. 19.90 లక్షలు కాజేసింది. అనంతరం మోసపోయిన విషయం తెలుసుకున్న మహిళ ఫిర్యాదుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.  

సస్పెక్ట్‌ షీట్‌...  
పదే పదే మాయమాటలతో ప్రజలను మోసగిస్తున్న మాయలేడిని పలుమార్లు నగర పోలీసులు హెచ్చరించినప్పటికీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో ఆమెపై పెనమలూరు పోలీసులు ఈ ఏడాది మార్చి 23న సస్పెక్ట్‌ షీట్‌ ఓపెన్‌ చేశారు. వైట్‌ కాలర్‌ నేరాల్లో ఆరితేరిన ఒక మహిళపై ఇలాంటి షీట్‌ ఓపెన్‌ చేయడం కమిషనరేట్‌ పరిధిలో ఇదే ప్రప్రథమం. కాగా మాయలేడి తన భర్తపైనే పెనమలూరు పోలీసుస్టేషన్‌లో 498 కేసు పెట్టింది.  

చట్టపరంగా చర్యలు తీసుకుంటాం..  
పెనమలూరు పోలీసుస్టేషన్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో మాయలేడిపై మరోమారు చీటింగ్‌ కేసు నమోదు చేశాం. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉంది. కోవిడ్‌ నేపథ్యంలోనూ ఆమెను అరెస్టు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఆమెను పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.      
  – బత్తిన శ్రీనివాసు

చదవండి: పండ్ల మార్కెట్‌కు వెళ్లిన వ్యక్తి.. బావిలో శవమై..!

మరిన్ని వార్తలు