బాలిక కిడ్నాప్‌ కేసు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

6 Jun, 2021 08:23 IST|Sakshi

బాలిక కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు

ముగ్గురిపై ‘ఫోక్సో’ కేసు నమోదు

ఇద్దరి అరెస్టు, పరారీలో మరో నిందితుడు

ములకలచెరువు(చిత్తూరు జిల్లా): బాలికను కిడ్నాప్‌ చేసి లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సురేష్‌కుమార్‌ శనివారం తెలిపారు. ఆయన కథనం మేరకు వైఎస్సార్‌ జిల్లా మిట్టపల్లెకి చెందిన బాలిక(17)ను గత నెల 12న తంబళ్లపల్లె మండలం పెండేరువారిపల్లె వద్ద మిట్టపల్లెకే చెందిన ఎస్‌. అశోక్‌కుమార్‌(19), అతడి అన్నయ్య ఎస్‌.శివయ్య(24), మామయ్య ఈశ్వరయ్య(56) తో కలసి కారులో వచ్చి కిడ్నాప్‌ చేశాడు. బాలిక బహిర్భూమికి వెళ్లిన సమయంలో కిడ్నాప్‌నకు పాల్పడ్డారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో తంబళ్లపల్లె ఎస్‌ఐ సహదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిందితుడు ఎస్‌.అశోక్‌కుమార్, అతడి అన్నయ్య, మామయ్యపై కిడ్నాప్‌ కేసు నమోదు చేయడంతో భయపడి బాలికను తంబళ్లపల్లె సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాలికను విచారించగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడి మోసం చేశాడని.. వాపోయింది. దీంతో నిందితులు ముగ్గురిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అశోక్‌కుమార్‌(19), ఈశ్వరయ్య(56) వైఎస్సార్‌ జిల్లా చేర్లోపల్లె సమీపంలోని మామిడి తోటలో దాక్కొని ఉండగా అరెస్టు చేసి తంబళ్లపల్లెకు తీసుకొచ్చారు. శనివారం ములకలచెరువు సర్కిల్‌ కార్యాలయంలో ఇద్దరి వివరాలను వెల్లడించారు. మరో నిందితుడు శివయ్య పరారీలో ఉన్నాడన్నారు. సమావేశంలో ఎస్‌ఐ సహదేవి పాల్గొన్నారు. 

చదవండి: చదివింది ఎమ్మెస్సీ.. అమ్మేది గంజాయి   
విషాదం: నాన్నా... ఇది తగునా !..

మరిన్ని వార్తలు