అడ్డుగా ఉందని చంపేశాడు

6 Jun, 2021 04:06 IST|Sakshi

తల్లి ప్రియుడే హంతకుడు 

మూడేళ్ల సింధూశ్రీ హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు 

నిందితుడి అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు 

విశాఖ క్రైం:   తల్లి వివాహేతర సంబంధం ఆ చిన్నారి పాలిట మృత్యుపాశమైంది. ప్రియుడి మోజులో పడి కన్నతల్లే కుమార్తె హత్యకు పరోక్షంగా కారణమైంది. తమ సహజీవనానికి అడ్డుగా ఉందన్న కోపంతో తల్లి ఇంట్లో లేని సమయంలో ప్రియుడు మూడేళ్ల పాపను దారుణంగా పిడిగుద్దులు గుద్ది చంపేశాడు. అనారోగ్యం కారణంగా పాప చనిపోయిందని తల్లి, చుట్టుపక్కల వారిని నమ్మించి శ్మశానానికి తీసుకెళ్లి ఖననం చేశాడు. పాప మరణంపై అనుమానం వచ్చిన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డీసీపీ ఐశ్వర్య రస్తోగి శనివారం మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు.  మారికవలస ప్రాంతంలో నివాసముంటున్న బొద్దాన రమేష్, వరలక్ష్మిలకు 2016లో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల పాప సింధూశ్రీ ఉంది. తీవ్ర మనస్పర్థలతో దంపతులు విడిపోగా.. కుమార్తెతో కలిసి వరలక్ష్మి మారికవలసలో ఉంటోంది. ఆమెకు బోరవానిపాలెంకు చెందిన బోర జగదీష్ రెడ్డితో 2020లో పరిచయమేర్పడింది.

అది వివాహేతర సంబంధంగా మారింది. మారికవలసలోని రాజీవ్‌ గృహకల్ప కాలనీలో ఓ ఇంట్లో వరలక్ష్మితో జగదీష్‌ సహజీవనం కొనసాగిస్తున్నాడు. అయితే తమ సంబంధానికి పాప అడ్డుగా ఉందని భావించిన జగదీష్‌ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 1న వరలక్ష్మి బయటికెళ్లగా.. అదే అదనుగా జగదీష్‌ చిన్నారి ముఖం, ఛాతి, కడుపులో పిడిగుద్దులు గుద్దడంతో అక్కడికక్కడే మృతిచెందింది. తల్లి వరలక్ష్మి ఇంటికి తిరిగిరాగా.. పాపకు బాగోలేదని నమ్మించే ప్రయత్నం చేశాడు. కేజీహెచ్‌ వరకు తీసుకెళ్లి అక్కడ హైడ్రామా నడిపాడు. ఆస్పత్రిలో ఆధార్‌ కార్డు లేకపోతే చికిత్స చేయరని నమ్మించి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికొచ్చాక ఆమె చనిపోయిందని చెప్పాడు. అనారోగ్యం కారణంగానే కుమార్తె మృతిచెందిందని వరలక్ష్మిని నమ్మించాడు. దీంతో చిన్నారిని మారికవలస శ్మశానవాటికలో ఖననం చేశారు. మరుసటిరోజు వరలక్ష్మి భర్త రమేష్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. అతడికి అనుమానమొచ్చి పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు పాప మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా చేయించారు. స్థానికులను విచారించగా.. వరలక్ష్మి, జగదీష్ ల వ్యవహారం బయటపడింది. జగదీష్‌ను తమదైన శైలిలో విచారించగా.. పాపను తనే హత్య చేసినట్టు అంగీకరించాడు. అతడిని అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు