అఖిలప్రియ బయటకొస్తే సాక్ష్యుల్ని బెదిరించవచ్చు

10 Jan, 2021 11:50 IST|Sakshi

కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌ : బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. పరారీలో ఉన్న అఖిలప్రియ భర్త ఏ3 భార్గవరామ్‌ కోసం గాలిస్తున్నారు. బెయిల్‌ కోసం అఖిలప్రియ విశ్వప్రయత్నం చేస్తున్నారు. తన ఆరోగ్యం బాగాలేదని, బెయిల్‌ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. అయితే వైద్యపరీక్షల్లో ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలింది. రేపు(సోమవారం) కోర్టులో అఖిలప్రియ బెయిల్‌, కస్టడీపై విచారణ జరగనుంది. అఖిలప్రియ బయటకొస్తే సాక్షులను బెదిరించవచ్చని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. 

కాగా, ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు శుక్రవారం సికింద్రాబాద్‌లోని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆమెను వారంరోజుల పాటు విచారించాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానాకి తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిల ప్రియ అనుచరులు మరికొన్ని నేరాలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయని, ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో పాటు పరారీలో ఉన్న అనుచరులను అరెస్టు చేయాల్సి ఉందని కోర్టుకు నివేదించారు. ( అఖిలప్రియను కస్టడీకి ఇవ్వండి )

బోయిన్‌పల్లి నుంచి కిడ్నాప్‌ చేసిన ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్‌రావులను నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లో బంధించిన నిందితులు వారి నుంచి కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్నారని దర్యాప్తు అధికారులు న్యాయస్థానానికి వివరించారు. వాటిని స్వాధీనం చేసుకోవాలంటే అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని తెలిపారు. మిగిలిన నిందితులను అరెస్టు చేసిన తర్వాతే కీలక ఘట్టమైన క్రైమ్‌ సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ను చేపట్టాల్సి ఉందని పోలీసులు తమ పిటిషన్‌న్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు