గుడిలో గుట్టుగా బాల్యవివాహం

3 Jan, 2021 08:18 IST|Sakshi

హసన్‌పర్తి: హసన్‌పర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి జరిపిస్తున్న బాల్య వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లికి చెందిన ప్రవీణ్‌కు అదే గ్రామానికి చెందిన బాలికతో వివాహం నిశ్చయమైంది. అమ్మాయి మైనర్‌ కావడంతో గుట్టుగా పెళ్లి చేయాలని భావించిన పెద్దలు, హసన్‌పర్తి మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. వివాహ సమయానికి వధువు, వరుడు, బంధువులు ఆలయానికి చేరుకున్నారు.

అయితే, ఆలయంలో బాల్యవివాహం జరుగుతోందన్న విషయం తెలుసుకున్న పోలీసులు, అక్కడికి చేరుకుని వధువు, వరుడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. వధువు మైనర్‌ కావడంతో పెళ్లి ఆపేయాలని సూచించారు. అనంతరం బాలికను చైల్డ్‌లైన్‌ కమిటీకి అప్పగించారు. వధువు, వరుడితో పాటు వారి తల్లిదండ్రులు, పురోహితుడు, ఫొటోగ్రాఫర్, బ్యాండ్‌ కార్మికులకు చైల్డ్‌ లైన్‌ కమిటీ సభ్యులు శనివారం ఉదయం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. బాలికకు పెళ్లి ఎలా చేస్తారంటూ పురోహితుడిని హెచ్చరించి, తొలి తప్పుగా భావించి వదిలిపెట్టారు.

జల్సాలకు డబ్బివ్వలేదని నాన్ననే చంపేశాడు
బిజినేపల్లి (నాగర్‌కర్నూల్‌): జల్సాలకు డబ్బు ఇవ్వలేదనే ఆగ్రహంతో కన్నకొడుకే బండరాయితో మోది తండ్రిని హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లికి చెందిన చెవిటి శ్రీనివాస్‌ (48) కు ఇద్దరు కుమారులు. వ్యవసాయ పనులు చేస్తూ వారిద్దర్నీ చదివించాడు. అయితే పెద్ద కుమారుడు గణేశ్‌ జల్సాలకు అలవాటు పడి జులాయిగా తిరుగుతున్నాడు. ఏదైనా పని చేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం గ్రామ శివారులో పనిచేస్తున్న తండ్రి వద్దకు వెళ్లి డబ్బులు కావాలని అడగ్గా ఇచ్చేది లేదన్నాడు. దీంతో గణేశ్‌ పక్కనే ఉన్న బండరాయితో తండ్రి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన శ్రీనివాస్‌ను చుట్టుపక్కల వారు గమనించి వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటనపై శనివారం మృతుడి తమ్ముడు మణ్యం ఫిర్యాదు మేరకు సీఐ గాంధీనాయక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయ్యో.. పాపం
చిలుకూరు: పంట పొలాల్లో ఓ ఆడశిశువు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురంలో శనివారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామ శివారులోని పొలాల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును పడేసి వెళ్లారు. ఉదయం పొలాలకు వెళుతున్న కూలీలు.. శిశువును గమనించి పరిశీలించగా అప్పటికే చనిపోయి ఉంది. శిశువు నోట్లో పాలపీక పెట్టి ఉంచారు. ఏడవకుండా ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ వైద్యశాల కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు విచారణ చేపట్టారు. ఆడపిల్ల పుట్టిందనే వివక్షతో తల్లిదండ్రులు ఇలాంటి దారుణానికి పాల్పడ్డారా..? లేదా శిశువు మృతి చెందడంతో పడేసి వెళ్లారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరోచోట.. వాగులో పడేశారు..
వర్ని: నిజామాబాద్‌ జిల్లా చందూర్‌ మండలం కారేగాం శివారులోని వాగులో «రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని శనివారం స్థానికులు గుర్తించారు. తిమ్మాపూర్‌– లక్ష్మాపూర్‌ వెళ్లే దారిలో వంతెన పైనుంచి చిన్నారి మృతదేహాన్ని పడేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు