నరేష్‌ జైన్‌.. పచ్చ బాబులు మధ్య ఓ ఆడిటర్‌

5 Sep, 2020 10:55 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: లక్ష రూ.కోట్ల అక్రమ వ్యవహారంలో విశాఖ ‘పచ్చ’ బాబుల పాత్రపై పోలీసులకు స్పష్టత వస్తోంది. మూడు రోజుల కిందట ఢిల్లీలో అరెస్టయిన బడా హవాలా డీలర్‌ నరేష్‌ జైన్‌ కేసులో నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైన వ్యాపారవేత్తలు ఉన్నట్టు పోలీసులకు ఉప్పందింది. దేశంలోనే అతి పెద్ద హవాలా కేసుగా పరిగణిస్తున్న ఈ వ్యవహారంలో విశాఖ బడా బాబుల పాత్రపై ప్రాథమిక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. భారీస్థాయిలో నగదును అక్రమంగా చలామణి చేశారన్న ఆరోపణలపై హవాలా డీలర్‌ నరేశ్‌ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మూడు రోజుల కిందట అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. (20 కోట్ల హ‌వాలా రాకెట్ గుట్టుర‌ట్టు)

వందల సంఖ్యలో డొల్ల కంపెనీలను, దాదాపు వెయ్యి అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను, రూ.1.07 లక్షల కోట్ల లావాదేవీలను ఈ కేసులో ఈడీ నిశితంగా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖ నగరానికి చెందిన బడా వ్యాపారవేత్తలు కూడా జైన్‌తో కుమ్మక్కై నకిలీ కంపెనీలను సృష్టించి హవాలాకు పాల్పడినట్టు విశాఖ పోలీసులకు సమాచారం వచ్చింది. నరేష్‌ జైన్‌కు  విశాఖ బడాబాబులకు మధ్య దళారిగా హైదరాబాద్‌కు చెందిన ఓ ఆడిటర్‌ వ్యవహరించినట్టు తెలుస్తోంది. దాదాపు రూ.300కోట్ల మేర నగదును అక్రమంగా చలామణీ చేసినట్టు   అనుమానిస్తున్నారు. ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు చేస్తున్నప్పటికీ నగర  పోలీసులు కూడా పక్కా సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు