తల్లి విషయంలో తప్పుగా మాట్లాడాడని దారుణ హత్య ..

2 Sep, 2021 09:30 IST|Sakshi
కేసు వివరాలు వెల్లడిస్తున్న సౌత్‌జోన్‌ రూరల్‌ డీఎస్పీ వై.జెస్సీప్రశాంతి

సాక్షి,గుంటూరు రూరల్‌: గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నగర శివారులోని బొంతపాడు వద్ద గత నెల 28వ తేదీ వ్యక్తి హత్య జరిగిన సంగతి తెలిసిందే. స్థానిక వార్డు సచివాలయం కార్యదర్శి కె.రాజేంద్రప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని బుధవారం అరెస్ట్‌ చేశారు. సౌత్‌ జోన్‌ రూరల్‌ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వై.జెస్సీప్రశాంతి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పెద్దజాగర్లమూడి గ్రామానికి చెందిన బొడ్డు మస్తాన్, మృతుడు అట్లూరి శ్రీనివాసరెడ్డి కలిసి వ్యవసాయం చేస్తుండేవారు. శ్రీనివాసరెడ్డి భార్య రెండు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. శ్రీనివాసరెడ్డి మద్యం తాగిన సమయంలో నిందితుడు మస్తాన్‌తో మీ నాన్న చనిపోయాడు, నాకు నా భార్య చనిపోయింది, మీ అమ్మతో సహజీవనం చేయాలని ఉంది అని అనేవాడని, దీనికి నిందితుడు అలా అనొద్దు అని నచ్చజెప్పేవాడని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం శ్రీనివాసరెడ్డి ఒడిశాలో బంధువుల ఇంటికి వెళ్లాలని చెప్పి, బస్సు ఎక్కించమని నిందితుడు మస్తాన్‌ను కోరాడు. గుంటూరు బస్టాండ్‌కు వెళ్లేటప్పటికి బస్సు వెళ్లిపోవడంతో ఇద్దరూ ఏటుకూరు సమీపంలో పొలాల్లో మద్యం సేవించారు. మద్యం సేవిస్తుండగా మృతుడు శ్రీనివాసరెడ్డి మస్తాన్‌ తల్లి విషయంలో మళ్లీ తప్పుడు ధోరణిలో మాట్లాడాడు. దీంతో నిందితుడు పక్కనే ఉన్న బండరాయితో మృతుడి తలపై మోది, మెడలోని కండువాను గొంతుకు బిగించి హత్య చేసి పక్కనే ఉన్న ముళ్లపొదల్లో మృతదేహాన్ని పడేసి పట్టాను కప్పేశాడు. విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన సీఐ ప్రేమయ్య, ఎస్‌ఐ కిషోర్, సిబ్బందిని డీఎస్పీ, అర్బన్‌ జిల్లా ఎస్పీ ఆరీఫ్‌హఫీజ్‌ ప్రత్యేకంగా అభినందించారు.

చదవండి: ఆడి కారు యాక్సిడెంట్‌: ఎన్నో అనుమానాలు.. అసలు ఏం జరిగింది?    

మరిన్ని వార్తలు