స్లిప్పులు తెచ్చాడంటూ ఘోర అవమానం

21 Apr, 2021 13:42 IST|Sakshi
ఎలీషా (ఫైల్‌)

సాక్షి, చీరాల‌: పరీక్షకు స్లిప్పులు తెచ్చాడని పాలిటెక్నిక్‌ విద్యార్థిని అందరి ముందు తనిఖీల పేరుతో అవమానించడంతో తీవ్ర మనస్తాపం చెంది ఓ విద్యార్థి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన చీరాల్లోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సోమవారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. వేటపాలెం మండలం లక్ష్మీపురానికి చెందిన కమల నాగరాజు, ఇందిర దంపతుల రెండో కుమారుడు ఎలీషా (19) బైపాస్‌ రోడ్డులోని యలమంచిలి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈఈఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

సోమవారం నుంచి కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. స్లిప్పులు తెచ్చి పరీక్ష రాస్తున్నాడని స్క్వాడ్‌ అధికారులు పరీక్ష కేంద్రం వద్దే ప్యాంట్‌ విప్పించి తనిఖీ చేశారు. అంతేగాక పరీక్ష రాయకుండా బయటకు పంపించారు. డీబార్‌ కూడా చేస్తున్నట్లు ప్రకటించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఎలీషా సాయంత్రం బేరుపేట సమీపంలో రైలు కింద బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.

మంగళవారం ఉదయం విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. విద్యార్థి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న టూటౌన్‌ సీఐ పాపారావు, ఎస్‌ఐలు ఆందోళన చేస్తున్న విద్యార్థులతో పాటు కళాశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. సాయంత్రానికి ఎలీషా మృతదేహంతో కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరుతూ కళాశాల ఎదుట బైఠాయించారు.

అన్యాయంగా తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని, తమకు న్యాయం చేయాలని, తమ బిడ్డ చావుకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్‌ తన సిబ్బందితో కళాశాల వద్దకు చేరుకుని సంఘటన జరగిన తీరు తెలుసుకున్నారు. బాధితుల ఆందోళన.. విద్యార్థుల నినాదాలతో కళాశాల ప్రాంగణం మార్మోగింది. కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల తీరుతో ఎలీషా ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు మధ్యవర్తుల హామీతో మృతుడి బంధువులు, విద్యార్థులు ఆందోళన విరమించారు.

చదవండి: 
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా..
కుమార్తె లవ్‌ మ్యారేజ్‌: కానిస్టేబుల్‌ దంపతుల ఆత్మహత్య

మరిన్ని వార్తలు