నల్గొండలో దారుణం.. కన్నీళ్లు తెప్పించే ఘటన..

18 Sep, 2022 15:58 IST|Sakshi

నల్లగొండ టౌన్‌: సాధారణ ప్రసవం పేరిట వైద్యులు చేసిన కాలయాపనకు ఓ నిండు ప్రాణం బలైంది. తీవ్ర రక్త స్రావంతో బాలింత చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు శనివారం ఆస్పత్రి ఎదుట ఆందో ళనకు దిగారు. కట్టంగూరు మండలం చెర్వు అన్నారం గ్రామానికి చెందిన శిరసు అఖిల మొదటి కాన్పు నిమిత్తం ఈ నెల 9న నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది.
చదవండి: పోలీస్‌ స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన హిజ్రాలు.. ఎందుకంటే?

మూడు రోజులుగా ఆమె నొప్పులతో ఇబ్బందిపడుతున్నా సాధారణ ప్రసవం పేరిట వైద్యులు కాలయాపన చేశారు. ఆపరేషన్‌ చేయకుండా ఈ నెల 11న నార్మల్‌ డెలివరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో అఖిల కడుపును వైద్యులు బలంగా ఒత్తడంతో మగశిశువును ప్రసవించింది. అదే సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో కుటుంబసభ్యులు బాధితు రాలిని ఏదైనా ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్తామని వేడుకున్నా వైద్యులు అంగీకరించకుండా మూడు రోజులపాటు ఆమెకు రక్తం ఎక్కిస్తూ గడిపారు. అనంతరం పరిస్థితి విషమించి అఖిల కోమాలోకి వెళ్లడంతో వైద్యులు ఈ నెల 14న సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్ప త్రికి తరలించారు. అక్కడ అఖిల పరిస్థితి మరింత విషమించి శుక్రవారం రాత్రి మృతి చెందింది.

మృతదేహంతో ఆందోళన: అఖిల మృతికి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఎదుట మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువు లు శనివారం ఆందోళనకు దిగారు. ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా నార్మల్‌ డెలివరీ చేయడంతో గర్భసంచి పగిలిపోయి రక్తస్రావమైందని ఆరోపించారు. అఖిల మృతికి కారణమైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆమె కుటుంబానికి, శిశువు సంరక్షణకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, టూటౌన్‌ పోలీసులు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వచ్చి కుటుంబసభ్యులతో మాట్లాడారు. డాక్టర్లపై ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  

మరిన్ని వార్తలు