పెట్రోల్‌ పోసి ఒంటికి నిప్పు, ప్రేమ వ్యవహారమే కారణమా?

4 May, 2021 11:24 IST|Sakshi
శరీరంపై కాలిన గాయాలతో చికిత్స  పొందుతున్న యరజాని అంకమ్మరావు 

యువకునిపై పెట్రోలు పోసి నిప్పంటించిన దుండగులు 

మద్దిపాడు మండలం నేలటూరు ఎస్సీ కాలనీలో ఘటన

బాలికతో ప్రేమ వ్యవహారమే కారణం?

మద్దిపాడు(ప్రకాశం జిల్లా): ఓ యువకుడిపై కొందరు దుండగులు పెట్రోలు పోసి నిప్పు అంటించారు. మద్దిపాడు మండలంలోని నేలటూరు ఎస్సీ కాలనీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నేలటూరు ఎస్సీ కాలనీకి చెందిన యరజాని అంకమ్మరావు(20) అనే యువకుడు ఆదివారం రాత్రి 11 గంటల వరకు కాలనీ సమీపంలో స్నేహితులతో గడిపి ఇంటికి వెళ్లాడు. అతడి వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చి మేస్త్రీ పిలుస్తున్నాడంటూ కాలనీ బయటకు తీసుకువెళ్లారు.

కాలనీ సమీపంలోని చప్టా వద్ద అతనితో మద్యం తాపించి, ఆ తర్వాత ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. అక్కడ నుంచి అంకమ్మరావు కేకలు వేస్తూ చర్చి సమీపంలో పడిపోగా అతని సోదరుడు వచ్చి తన టీషర్ట్‌ విప్పి మంటలు ఆర్పివేశాడు. స్థానికులు స్పందించి 108లో రాత్రి 2 గంటల సమయంలో ఒంగోలు రిమ్స్‌కు చేర్చారు. తనపై వెల్లంపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఒక యువకుడు పెట్రోలు పోసి నిప్పంటించాడని, అతనితోపాటు మరో ఇద్దరు ఉన్నారని బాధిత యువకుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఒంగోలు రూరల్‌ సీఐ సుబ్బారావు, మద్దిపాడు ఎస్సై నాగరాజు తెలిపారు.

బాలికతో ప్రేమ వ్యవహారమే కారణం?  
ఓ బాలికతో కలిసి ఉన్న ఫొటోలను అంకమ్మరావు తన స్నేహితులకు ఆదివారం రాత్రి వాట్సప్‌లో పంపినట్లు సమాచారం. ఆ బాలిక తనకు దక్కదనే ఆలోచనతో అంకమ్మరావు ఈ పని చేసి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. కాగా అంకమ్మరావు శరీరం 70 శాతం మేర కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది.

చదవండి: యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్స్‌   
రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు