కురిచేడు ఘటన: ఆసక్తికర విషయాలు వెలుగులోకి

11 Aug, 2020 10:45 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: కురిచేడు శానిటైజర్ ఘటనపై సిట్ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. శానిటైజర్‌ నిర్వాహకుడైన సాలె శ్రీనివాస్‌ను సిట్‌ విచారించి అన్ని కోణాల్లో కూపీ లాగింది. పేదరికంలో ఉన్న శ్రీనివాస్‌ తొలుత ఓ యజమాని వద్ద వాహనాలకు వాటర్‌ సర్వీసింగ్‌ చేసే పనిలో చేరినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం సొంతంగానే వాటర్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాడు. లాక్‌డౌన్‌ సమయంలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో శానిటైజర్ల తయారీపై చేసిన వీడియోను చూసి శ్రీనివాస్‌ ఆకర్షితుడయ్యాడు. దీంతో వెంటనే ఇంట్లోనే శానిటైజర్‌ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తన కూతురుకు చెందిన బంగారు వస్తువులను అమ్మి రూ. 4,500 నగదు సమీకరించుకున్నాడు.  (చదివింది మూడు.. నకిలీ కంపెనీని సృష్టించి)

ఆ నగదుతో శానిటైజర్‌ తయారీకి కావాల్సిన ముడిసరుకులను కొని తొలుత ఇంట్లోనే శానిటైజర్ల తయారీని ప్రారంభించాడు. వ్యాపారం ప్రారంభించిన పదిరోజుల్లోనే బిజినెస్ సక్సస్ కావడం, ఆదాయం ఆశాజనకంగా ఉండటంతో వ్యాపారాన్ని వివిధ రాష్ట్రాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసం ఇద్దరు వ్యక్తులను కలిసి హైదరాబాద్‌ జీడిమెట్లలో పారిశ్రామికవాడ పైప్‌లైన్‌ రోడ్డులో పర్‌ఫెక్ట్‌ కెమికల్స్‌ అండ్‌ సాల్వెంట్స్‌ కంపెనీ ఏర్పాటు చేశారు. అంతేగాక.. తయారు చేసిన శానిటైజర్‌లను తెలుగు రాష్ట్రాల్లో సరఫరా చేయడానికి ఇద్దరు పంపిణీ దారులను శ్రీనివాస్‌ నియమించుకున్నాడు. (కురిచేడు ఘటన.. దర్యాప్తు ముమ్మరం)

అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో శ్రీనివాస్‌ కరోనా బారిన పడ్డాడు. దీంతో బాధ్యతలను తమ్ముడికి అప్పగించాడు. పెరిగిన ఖర్చులకు తోడు తగిన ఆదాయం రాలేదనే కారణంతో ఇథైల్‌ ఆల్కహాల్‌కు బదులుగా మరో ద్రావణాన్ని కలిపి శ్రీనివాస్‌ విక్రయాలు సాగించాడు. ఇంతలో కురిచేడు ఘటన వెలుగులోకి రావడంతో ఆందోళన చెంది విజయవాడలోని తన మిత్రుడి నివాసంలో తల దాచుకున్నాడు. అయితే శ్రీనివాస్‌ ఆచూకీని గుర్తించిన సిట్‌ బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. మంగళవారం మధ్యాహ్నం 12.30కి శానిటైజర్‌ కేసులో నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా