ఆధిపత్య పోరుతోనే ప్రసాద్‌ హత్య

5 May, 2022 03:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఏలూరు ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు గంజి నాగప్రసాద్‌ హత్యకేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు బజారయ్యతోపాటు మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఏలూరులో బుధవారం జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన మేరకు.. ఈ హత్యకేసులో అదేరోజు ముగ్గురు నిందితులు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోగా, విచారణ అనంతరం మరో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. జి.కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యుడు బిరుదుగడ్డ బజారయ్య, అదే గ్రామానికి చెందిన మండవల్లి సురేష్, ఉండ్రాజవరపు మోహన్‌కుమార్‌ అలియాస్‌ మోహన్, శానం హేమంత్, గంజి నాగార్జున, రెడ్డి సత్యనారాయణ అలియాస్‌ ఆర్‌ఎస్‌ఎన్‌ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. మూడు కత్తులు, ఒక కారు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందనే కోణంలోను విచారిస్తున్నారు. 

హత్యకు పక్కా ప్రణాళిక 
జి.కొత్తపల్లిలో గంజి నాగప్రసాద్, బజారయ్య వర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ప్రసాద్‌ను హత్య చేయాలనే ఉద్దేశంతో బజారయ్య తన వర్గాన్ని పెంచుకుంటూ వెళ్లాడు. రెడ్డి సత్యనారాయణ, మండవల్లి సురేష్, శానం హేమంత్, గంజి నాగార్జున, మరికొందరితో గతనెల 20న సమావేశమయ్యాడు. గతనెల 30న ఉదయం సుమారు 7.40 గంటల సమయంలో ఇంటి నుంచి మోటారు సైకిల్‌పై నాగప్రసాద్‌ బయలుదేరుతుండగా నాగార్జున వారికి సమాచారం అందించాడు. మోహన్‌కుమార్‌ మోటారు సైకిల్‌ నడుపుతుండగా కత్తులను తువ్వాలులో చుట్టుకుని సురేష్‌ మధ్యలోను, హేమంత్‌ వెనుక కూర్చున్నారు. మోహన్‌కుమార్‌ మోటారు సైకిల్‌తో ఎదురుగా వెళ్లి నాగప్రసాద్‌ మోటారు సైకిల్‌ను ఢీకొట్టాడు. కిందపడిపోయిన నాగప్రసాద్‌ను  సురేష్, హేమంత్, మోహన్‌ కత్తులతో నరికి హత్యచేశారు. నాగార్జున అక్కడికి వచ్చి వారిని ప్రోత్సహించాడు. 

మరిన్ని వార్తలు