ప్రాణం తీసిన అంబులెన్స్‌: నిండు గర్భిణి సహా..

10 Jun, 2021 19:12 IST|Sakshi
ప్రమాదంలో మృతి చెందిన నిండు గర్భిణి జయలక్ష్మి

చెన్నె: ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించే అంబులెన్స్‌ ప్రమాదానికి గురయ్యింది. చెట్టును ఢీకొట్టడంతో తొమ్మిది నెలల నిండు గర్భిణితో పాటు ఆమె అత్తి, వదిన దుర్మరణం పాలయ్యారు. పురుటినొప్పులతో బాధపడుతుండడంతో తెల్లవారుజామున ఆస్పత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కొన్ని గంటల్లో మరో ప్రాణానికి జన్మనిచ్చే మహిళ మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. ఒకేసారి ముగ్గురిని కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో జరిగింది.

సొరపట్టు గ్రామానికి చెందిన సెల్వీ తన కోడలు జయలక్ష్మికి తొమ్మిది నెలలు నిండడంతో బుధవారం తెల్లవారుజామున నొప్పులు వచ్చాయి. వెంటనే కుమార్తె అంబికతో కలిసి అంబులెన్స్‌ తీసుకుని ఆస్ప్రతకి బయల్దేరారు. అయితే తెల్లవారుజామున 4.45 గంటలకు మార్గమధ్యలో అంబులెన్స్‌ టైర్‌ పేలి వాహనం అదుపు తప్పింది. వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టడంతో వాహనంలోని అత్తాకోడళ్లతోపాటు ఆమె కుమార్తె తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజాము కావడంతో ఈ ప్రమాదం వార్త ఎవరికీ తెలియలేదు. దీంతో కొన ప్రాణం మీద ఉన్నవారిని ఎవరూ కాపాడలేకపోయారు. గాయాలతో బాధపడుతూ అక్కడికక్కడే మృతి చెందారు. కొన్ని గంటల తర్వాత అటుగా వెళ్లేవారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

అయితే అంబులెన్స్‌ డ్రైవర్‌ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు. జయలక్ష్మి కుటుంబానికి రూ.5 లక్షలు, సెల్వీ, అంబిక కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బీమా పరిహారం వెంటనే కుటుంబాలకు అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.

చదవండి: పాలు తక్కువ ఇస్తోందని ఇంటిముందే నరికి పూడ్చి
చదవండి: రోడ్డుపై టైటానిక్‌ విన్యాసాలు.. వైరల్‌

మరిన్ని వార్తలు